ఏపీలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని ప్రజలు భావించారు. కానీ ఊహించని విధంగా టీడీపీకి జనసేన మద్దతు ఇవ్వడం... బీజేపీ మద్దతు కూడా టీడీపీకే ఉండటంతో ఏపీలో వైసీపీ 67 ఎమ్మెల్యే స్థానాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఎన్నికల అనంతరం జగన్ కు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయి. వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతూ వచ్చింది. 


 
2014 ఎన్నికల్లో రాయలసీమలో మెజారిటీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కానీ నంద్యాల ఉపఎన్నికల్లో మాత్రం టీడీపీనే గెలవడంతో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడం కష్టమే అని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని తీసుకున్న నిర్ణయంతో పరిస్థితులు మారిపోయాయి. పాదయాత్రలో జగన్ ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకున్నాడు. 


 
జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజల్ని ఎంతగానో ఆకర్షించాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో 151 ఎమ్మెల్యే స్థానాలలో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చింది. మొదట్లో జగన్ పరిపాలనకు ప్రజల్లో మంచి మార్కులే పడినా ఆ తరువాత మాత్రం సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేక ఫలితాలే వస్తున్నాయి. జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి శాసన మండలి బ్రేక్ వేసింది. 


 
అనంతరం జగన్ మండలి రద్దు దిశగా చర్యలు చేపట్టారు. కేంద్రం ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. మరోవైపు ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయని భావించిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఉగాది ఇళ్ల పట్టాల పథకం తాత్కాలింగా పోస్ట్ పోన్ అయింది. రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి బడ్జెట్ సమావేశాలు జరపనున్నట్లు జగన్ ప్రకటించటంతో మండలి రద్దు ఆమోదం పొందలేదు కాబట్టి మండలిని సమావేశపరుస్తాడో లేదో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సీఎం జగన్ కు ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: