భారత రాజ్యాంగం ప్రతీ వ్యక్తికి స్వేచ్చ ఇచ్చింది. అలాగే వారికి ఉన్న హక్కులు దేశానికి, సమాజానికి భంగం అనుకున్నపుడు వెనక్కు తీసుకునే అవకాశమూ ఏలిన వారిని ఇచ్చింది. ఇపుడు దేశంలో అదే జరుగుతోంది. దీన్ని ఎవరూ తప్పు పట్టరు. ఎందుకంటే ఇది దేశ హితం కోసం. అందరి మనుగడ కోసం. ఓ విధంగా మానవాళి మరో జన్మ కోసం. ఈ యాగంలో సమిధలు కానక్కరలేదు. కొంత స్వేచ్చ ఇస్తే చాలు. కత్తి పట్టనక్కరలేదు, బుద్ధిగా ఇంట్లో కూర్చుంటే చాలు

 

అయితే మన జనం వట్టి అల్లరి పిల్లలు. జనతా కర్ఫ్యూ బాగా చేశారనిపించుకున్నారు. అంతే ఆ బుద్ధి మరుసటి రోజే వంకర అయింది మళ్ళీ మామూలే అన్నట్లుగా రోడ్లు పట్టుకు తిరుగుతున్నారు. మరి ఒక యుధ్ధం కోసం అంతా సిధ్ధం చేసుకున దేశ పెద్దకు ఇది కోపం కలిగించిందనడంలో తప్పులేదు. అందుకే మోడీ దేశమంతా లాక్ డౌన్ అనేశారు. వారూ వీరూ లేరు అంతా ఇంట్లో కూర్చోండి అంటూ లక్ష్మ‌ణ రేఖ గీసేశారు. మోడీ గీత దాటితే ఏమవుతుందో వేరే చెప్పనక్కరలేదు.

 

అలాంటి భయస్థులు గడప ముఖం కూడా చూడరు. కానీ కొంతమంది ఇంకా అల్లరి చేస్తూనే ఉంటారు. వారిని ఇంట్లో కూడా తాళ్ళతో కాళ్ళూ చేతులూ కట్టేయాలి. దానికి కూడా మోడీ మాస్టార్ వద్ద బెత్తం మంత్రం ఉంది. అదే పెట్రోల్ రేట్లు విపరీతంగా పెంచేయడం. కేవలం లాక్ డౌన్ రోజుల్లోనే పెట్రోల్ ఇలా అసలు ధరకు రెండు మూడు రెట్లు పెంచి రేటు వింటేనే గూబ గుయ్యిమనిపిస్తారు.

 

దాంతో షికార్లూ, తిరుగుళ్ళూ పూర్తిగా  బంద్ అవుతాయి. ఈ దెబ్బతో వాహనాలన్నీ మూలన చేరుతాయి. దాంతో పాటే మరో బెత్తం కూడా మోడీ రెడీగా తయారు చేసి ఉంచుకున్నారట. అదేంటి అంటే ఆర్ధిక ఎమర్జెన్సీ. అంటే దేశంలో ఉన్న నగదు అంతా ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. బ్యాంకుల్లో మన డబ్బే ఉన్నా తీసుకోవడానికి పరిధులు  పరిమితులూ విధిస్తారట. 

 

అంటే చేతిలో చిల్లిగవ్వ ఆడదు. మరి తిరుగుళ్ళు ఎక్కడ. షోకులు ఎక్కడ. అంతే నీరసంగా ఇంట్లోనే అటూ ఇటూ పచార్లు కొట్టడమే మిగులుతుంది. ఇది బహుశా మోడీ రెండవ దశలో అమలుచేస్తారని భావిస్తున్నారు. మెల్లగా శిక్షలను పెంచుకుంటూ పోతారు. బుద్ధిగా ఇంటిపట్టున ఉండేలా చూస్తారు.

 

 నిజానికి వీటిని శిక్షలు అనకూడదు. మన రక్షణ కోసం, మన ఆరోగ్యం కోసం ఒక తండ్రిలా మోడీ కడుతున్న శ్రీరామరక్షగానే చూడాలి. ఏది చేసినా మోడీ మన కోసమే చేస్తున్నారనుకోవాలి. ఆయనకు సహకరించడం కాదు, మనకు మనమే సహకరించుకుంటే చాలు. కరోనా బూచి ఈ దేశం నుంచి పారిపోతుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: