అమెరికాలో క‌రోనా వైర‌స్ క‌ల‌క‌లం రేపుతోంది. రోజురోజుకూ దాని బారిన‌ప‌డేవారి సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. ఒక్క‌రోజు వ్య‌వ‌ధిలోనే అక్క‌డ‌ పదివేల కొత్త కేసులు నమోదు కావడంతో ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఆ దేశంలో కోవిడ్‌ బాధితుల సంఖ్య 49,594కు చేరుకుంది. ఒకే రోజు 130 మందికిపైగా మృతి చెందనిట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ దారుణ ప‌రిస్థితుల్లో అమెరికాలో ఉంటున్న తెలుగువారి క‌ష్టాలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా న్యూజెర్సీ, న్యూయార్క్‌లో తెలుగు ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉంటున్నారు. ఇక్క‌డే కొవిడ్‌-19 ప్ర‌భావం కూడా చాలా తీవ్రంగా ఉండ‌డంతో తెలుగువారు బిక్కుబిక్క‌మంటున్నారు. మంగళవారం సాయంత్రానికి ఒక్క న్యూయార్క్‌ నగరంలో 29,875 కేసులు నమోదు అయ్యాయి. ఇక‌ న్యూజెర్సీలో 2,844 మంది కోవిడ్‌ బారినపడ్డారు. న్యూయార్క్‌లో ఈ వ్యాధి బారినపడ్డ వారిలో 157 మంది మృతి చెందారు. న్యూజెర్సీలో 2,844 మందికి పాజిటివ్‌ రాగా చికిత్స పొందుతూ వారిలో 27 మంది మరణించారు. 

 

మంగ‌ళ‌వారం నాటికి అమెరికాలో మృతుల సంఖ్య 622కి పెరిగింది. ఈ ప‌రిస్థితుల మ‌ధ్య ఇళ్ల నుంచి ఎవ‌రూ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. చాలా మంది తెలుగువారు అక్క‌డి నుంచి రావాల‌ని అనుకుంటున్నా రాలేని అడుగుబ‌య‌ట‌పెట్ట‌లేని ప్ర‌తికూల ప‌రిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సోష‌ల్ మీడియాలో చేస్తున్న పోస్టులు అంద‌రిని క‌ల‌చివేస్తున్నాయి. అయితే.. రెండేళ్ల క్రితం నాటి జ‌నాభా లెక్కల ప్రకారం న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్‌ రాష్ట్రాల్లో 7.68 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఆ మూడు రాష్ట్రాల్లో ఉన్న అమెరికన్లతో పోలిస్తే మన వాళ్లు 3.8 శాతం ఉండగా శాన్‌ఫ్రాన్సికో, అలమేద (కాలిఫోర్నియా) కౌంటీల్లో భారతీయులు 3.4 శాతం మంది ఉన్నారు. క‌రోనా ప్ర‌భావం తీవ్రంగ ఉండ‌డంతో ఇక్క‌డి భార‌తీయ కుటుంబాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. ఇక‌ కోవిడ్‌ కల్లోలానికి ప్రపంచ వ్యాప్తంగా 17000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద సుమారు 175 దేశాలు క‌రోనాతో విల‌విలాడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: