ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా వైర‌స్ ప్ర‌భావం భార‌త్‌లోనూ రోజురోజుకూ తీవ్ర‌మ‌వుతోంది. ఈ వైర‌స్ బాధితుల సంఖ్య ఏకంగా 519కి చేరింది. మృతుల సంఖ్య 11కి చేరింది. జ‌న‌జీవ‌నం మొత్తంగా స్తంభించిపోయింది. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మై క‌రోనా క‌ట్ట‌డికి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు క‌ట్టుదిట్టంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌జ‌ల నుద్దేశించి మాట్లాడుతూ ప‌లుకీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై ఉండాల‌ని కోరారు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావొద్దని ఆయ‌న సూచించారు. క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఆయ‌న కోరారు. ఈ నేప‌థ్యంలో భార‌తీయ‌రైల్వేశాఖ కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు అన్ని ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు బుధ‌వారం ఉద‌యం ప్ర‌క‌టించింది. ప్ర‌ధాని మోడీ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. 

 

నిజానికి.. ప్ర‌ధాని మోడీ దేశ వ్యాప్తంగా మార్చి 22న జ‌న‌తా క‌ర్ఫ్యూకు పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు రైల్వేశాఖ కూడా మార్చి 22 నుంచి మార్చి 31వ తేదీ వ‌ర‌కు అన్ని ప్యాసింజ‌ర్ రైళ్ల‌ను ర‌ద్దు చేసింది. అయితే.. తాజాగా.. ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో రైల్వేశాఖ కూడా ప్యాసింజ‌ర్ రైళ్ల ర‌ద్దును పొడిగించింది. అయితే.. ఇదే స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర స‌రుకుల‌ ర‌వాణా మాత్రం కొన‌సాగుతుంద‌ని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాగా, తాజాగా, త‌మిళ‌నాడులో కూడా క‌రోనాతో బాధ‌ప‌డుతూ ఒక‌రు మృతి చెందడంతో ఆ రాష్ట్రంలో క‌ల‌క‌లం రేగుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా స్వీయ‌నియంత్ర‌ణ పాటించాల‌ని ప్ర‌భుత్వాలు కోరుతున్నాయి. అత్య‌వ‌స‌ర సేవ‌ల‌ను అందించేందుకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని పేర్కొంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: