కరోనా కట్టడి కోసం ప్రధాని మోడీ దేశంలోని వివిధ రంగాలకు చెందిన నిపుణులతో సమావేశమవుతున్నారు. వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మంగళవారం మోడీ దేశంలోని పత్రికల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న ఈనాడు దిన పత్రిక అధిపతి రామోజీరావు ప్రధాని మోడీకి కరోనా కట్టడి కోసం పలు సూచనలు చేశారు.

 

 

కరోనా వైరస్‌ దేశ గ్రామ సీమలకు పాకకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని మోదీని రామోజీరావు కోరారు. మన దేశంలో 65% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ మహమ్మారి నుంచి పల్లెలకు రక్షణ కవచం ఏర్పరచడానికి చర్యలు తీసుకోవడం అన్నింటి కన్నా ముఖ్యం. ఈ విషయంలో మీడియా కచ్చితంగా తన విద్యుక్తధర్మాన్ని నిర్వర్తిస్తూ రాత్రింబవళ్లు ప్రజలకు సమాచారం అందిస్తోందన్నారు రామోజీ.

 

 

అదే సమయంలో ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు రామోజీ రావు. గ్రామీణ ప్రజలను ఈ మహమ్మారి నుంచి రక్షిస్తే ఆ మేరకు మన వైద్య ఆరోగ్య రంగంపై భారం తగ్గుతుందని మోడీకి రామోజీ రావు సూచించారు. సాధ్యమైనంత త్వరగా ఈ వైరస్‌కు టీకా, మందులను కనుగొనేలా భారత ఔషధ రంగాన్ని ప్రోత్సహించాలన్నారు.

 

 

మీరు తొలి నుంచీ ‘భారత్‌లో తయారీ’ నినాదాన్ని వినిపిస్తున్నారు. మన దేశంలో బలమైన ఔషధ తయారీ రంగం ఉండటం మనకు గర్వకారణం. ఇప్పటికే టీకాలు, ఔషధాల తయారీలో మన పరిశ్రమ గొప్ప ముందడుగు వేసింది. వారందర్నీ మీరు ఆహ్వానించి అవసరమైన మద్దతు తీసుకోవడంతోపాటు, వారికి కావాల్సిన చేయూతను అందిస్తే తక్షణం పరిశోధనలపై దృష్టిసారించి సాధ్యమైనంత త్వరగా కరోనాకు టీకాలు, మందులు కనుగొంటారని రామోజీరావు మోడీతో అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా, ఇటలీ నుంచి మనం నేర్చుకోవాలి. వారి అనుభవాలు మనకు గొప్ప మేలు చేస్తాయి. వాళ్లు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నదానిపై ప్రభుత్వం వైపు నుంచి కొందరు నిపుణులు అధ్యయనం చేసి అందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో గుర్తించాలని రామోజీ సలహా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: