సందుజూసి దొంగ‌లు రెచ్చిపోతున్నారు. అందిన‌కాడికి దోచుకుపోతున్నారు. ఓవైపు క‌రోనాతో దేశప్ర‌జ‌లు వ‌ణికిపోతుంటే.. దొంగ‌లు మాత్రం హాయిగా త‌మ‌ప‌ని కానిచ్చేస్తున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రైవేట్ సంస్థ‌లు, విద్యాసంస్థ‌లకు సెల‌వులు ప్ర‌క‌టించారు. ఇక జ‌న‌మంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. మ‌రోవైపు పోలీసులు త‌మ ఫోక‌స్ అంతా కూడా లాక్‌డౌన్‌పైనే ఉంచుతున్నారు. ఇక ఇదే అద‌నుగా చేసుకుని దొంగ‌లు రెచ్చిపోతున్నారు. మూసివేసిన సంస్థ‌లే ల‌క్ష్యంగా చోరీల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే బెంగ‌ళూరులో ఓ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఓ కాలేజీలో చొరబడి రూ. పది లక్షల విలువైన కంప్యూటర్ పరికరాలను ఎత్తుకెళ్లారు. అలాగే.. గతవారంలో ఓ స్కూల్లో పిల్ల‌ల నుంచి వ‌సూలు చేసిన‌ ఫీజుల మొత్తం రూ.78 వేలను అప‌హ‌రించారు.

 

బెంగ‌ళూరు నగరంలోని హెబ్బగొడి ప్రాంతంలో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ డి సేల్స్ కళాశాలలో దొంగలు చొరబడి సుమారు పది లక్షల రూపాయల విలువైన కంప్యూటర్ పరికరాలను చోరీ చేశారు. ఉదయాన్నే కళాశాలకు వచ్చిన సిబ్బంది తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ ల్యాబ్‌లో ఉన్న 56 ప్రాసెసర్లు, ర్యామ్‌లు, అలాగే మ్యాథమేటిక్స్ ల్యాబ్‌లోని 30 ప్రాసెసర్లు ర్యామ్‌లను అపహరించినట్లు ప్రిన్సిపాల్ రాయ్ ఫాదర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెబ్బగొడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

అయితే.. గత వారం కూడా కొననకుంటె ఏరియాలోని లయోలా హైస్కూల్‌లోనూ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. యాజమాన్యం విద్యార్థుల నుంచి అప్లికేషన్ ఫీజు కింద వసూలు చేసిన రూ.78 వేలను అప‌హ‌రించారు. పాఠశాల గది వెనుక తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించి నగదు దోపిడీ చేసినట్లు స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగదుతో పాటు సెల్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్ బ్యాగ్, మొబైల్ చార్జర్లను సైతం తీసుకెళ్లారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్ర‌జ‌లు, విద్యాసంస్థ‌ల యాజ‌మాన్యాలు అప్ర‌మ‌త్తంగ ఉండాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: