రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా గజగజా వణికిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ తేలినట్లు ప్రకటన చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 39కు చేరింది. కరోనా సోకిన వారిలో కొత్తగూడెం డీఎస్పీ, వారి వంటమనిషి కూడా ఉండటం గమనార్హం. లండన్ వచ్చి వచ్చిన కొడుకును డీఎస్పీ క్వారంటైన్ కు పంపకపోవడంతో ఈయనపై ఇప్పటికే కేసు నమోదైంది. 
 
రాష్ట్రంలో లోకల్ కాంటాక్ట్ ద్వారా కరోనా సోకిన వారి సంఖ్య ఐదుకు చేరింది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో సీఎం కేసీఅర్ ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోతే ఆర్మీని రంగంలోకి దించుతామని హెచ్చరించారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను కూడా జారీ చేస్తామని అన్నారు. రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికైనా వెనుకాడనని ప్రకటన చేశారు. 
 
మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8కు చేరింది. సీఎం జగన్ రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ఆశా వర్కర్లను, వాలంటీర్లను ఉపయోగించుకోవాలని సూచించారు. రెండోసారి సర్వే ద్వారా వచ్చిన సమాచారం నుండి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని అన్నారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే హోం ఐసోలేషన్ పాటించాలని, అధికారులకు సమాచారం అందించాలని అన్నారు. 
 
నిన్న లండన్ నుంచి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో 12,131 పడకలను క్వారంటైన్ కింద సిద్ధం చేసింది. ప్రభుత్వం రాష్ట్రంలో ఐదుగురు ఒకే చోట గుమికూడితే 144 సెక్షన్ కింద అరెస్ట్ చేస్తామని పేర్కొంది. ప్రభుత్వం ముందుజాగ్రత్తచర్యల్లో భాగంగా లక్ష మాస్కులను ఆర్డర్ చేసింది. 13 కంపెనీలకు 20 వేల లీటర్ల శానిటైజర్ తయారీకి బాధ్యతలు అప్పగించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: