ప్రపంచాన్నే వణికించేస్తున్న కొరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాను కూడా వణికించేస్తోంది. అమెరికాలో ఉండే అమెరికన్స్ సంగతి ఎలాగున్నా అమెరికాలో ఉండే భారతీయులు ప్రధానంగా తెలుగు వాళ్ళు మాత్రం విలవిలాడిపోతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా తెలుగు వాళ్ళుంటారు. అమెరికాలో కొరోనా వైరస్ కూడా పై రాష్ట్రాల్లోనే ఎక్కువ ప్రభావం చూపుతుండటంతో  అక్కడి వాళ్ళే కాకుండా ఇండియాలో ఉన్న వాళ్ళ కుటుంబసభ్యుల బాధలు చెప్పలేకున్నారు.

 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం న్యూయార్క్ లోనే సుమారు 12.5 వేల కేసులు నమోదయ్యాయట. అలాగే న్యూజెర్సీలో కూడా సుమారు 3 వేల కేసులు బయటపడ్డాయట. వైరస్ బయటపడినపుడు అమెరికాలో వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు  నమోదయ్యాయి. అయితే రోజులు గడిచే కొద్దీ పై రాష్ట్రాలు వెనక్కుపోయి న్యూయార్క్, న్యూజెర్సీ మొదటి రెండుస్ధానాలను ఆక్రమించాయి.

 

న్యూయార్క్ లో నమోదైన కేసుల్లో 160 మంది మరణించగా న్యూజెర్సీలో 30 మంది చనిపోయారు. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల్లోనే సుమారుగా 8 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా పెరిగిపోతుండటంతో తెలుగు వాళ్ళంతా వణికిపోతున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల్లో కేసులు పెరిగిపోతుండటంతో తమను ఆదుకునే వారు కూడా లేకపోవటంతో తెలుగు వాళ్ళ పరిస్ధితి దయనీయంగా మారిపోయింది.

 

అవసరానికి ఒకరికొకరు అనే భావన అమెరికా వాళ్ళల్లోని భారతీయుల్లో ఉన్నా అందరూ కలిసే సందర్భం ఇది కాకపోవటంతోనే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికివారుగా కొరోనా వైరస్ దెబ్బకు వణికిపోతుండటంతో నలుగురు కలవాలంటేనే భయపడిపోతున్నారు. అందుకనే ఎంత సన్నిహిత కుటుంబాలైనా కలవటానికే భయపడిపోతున్నారు. ఇదే సమయంలో అమెరికా-ఇండియాల మధ్య విమానాలను కూడా రద్దు చేయటంతో అమెరికా నుండి ఇండియాకు వద్దామని అనుకున్నా, ఇండియా నుండి అమెరికాకు వెళదామని అనుకున్న వారు కూడా దిక్కుతోచక అవస్తలు పడుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: