క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచి లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లెవ‌రూ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఎక్క‌డ‌క‌క్క‌డ జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. అత్య‌వ‌స‌రం త‌ప్ప మిగ‌తా అన్నిరంగాల కార్య‌క‌లాపాలు నిలిచిపోయాయి. అయితే.. ఒక్క‌సారిగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌తో ఇంటికే ప‌రిమిత‌మైన వారికి కొంత‌మేర‌కు ఎలాంటి ఇబ్బందులు లేవుగానీ.. పాపం.. ట్ర‌క్ డ్రైవ‌ర్లు మాత్రం ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయారు. రాష్ట్రాల స‌రిహ‌ద్దుల‌ను మూసివేయ‌డంతో ట్ర‌క్ డ్రైవ‌ర్లంద‌రూ త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోకుండా ఆగిపోయారు. అయితే.. ఇక్క‌డ దయ‌నీయ‌మైన ప‌రిస్థితి ఏమిటంటే.. వారికి అక్క‌డ క‌నీస అవ‌స‌రాలు కూడా తీర‌డం లేదు. తింటానికి తిండిగానీ..  తాగ‌డానికి నీళ్లు కూడా ప‌లు చోట్ల దొర‌క‌క ట్ర‌క్ డ్రైవ‌ర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త‌మ‌నెవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు.

 

మంగ‌ళ‌వారం రాత్రి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ మాట్లాడుతూ.. ఈరోజు అర్ధ‌రాత్రి నుంచే లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే.. దీంతో సిలిండర్లు తీసుకెళ్లేవారు, ఆహార పదార్థాలు తీసుకెళ్లేవారు, ఇనుము, రాడ్లు తీసుకెళ్లేవారు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లేవారు... ఇలా అన్ని రకాల ట్రక్ డ్రైవర్లూ త‌మ గ‌మ్య‌స్థానాలు చేరుకోకుండానే స‌రిహ‌ద్దుల వ‌ద్ద‌ ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వారు ఆగిపోయిన చోట నిత్యావ‌స‌రాలు తీర్చుకోలేని ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. తమకు నీరు, ఆహారం లేదనీ, అసలు తమ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారుతోంద‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తమను సరిహద్దులు దాటనివ్వకుండా ఆపేయడంతో... ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్రస్తుతం రోడ్ల పక్కన ఉండే దాబాలు, రెస్టారెంట్లను కూడా మూసేశారు. దాంతో తాము తినడానికి ఏమీ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇండియన్ ఫౌండేషన్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్రకారం... దేశవ్యాప్తంగా దాదాపు 500000 మంది ట్రక్ డ్రైవర్లు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని ట్రాన్స్‌పోర్ట్ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఇక్క‌డ ట్ర‌క్ డ్రైవ‌ర్లుప‌లు ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. కొంత ముంద‌స్తుగా లాక్‌డౌన్ ప్ర‌క‌టించి ఉంటే.. త‌మ‌కు ఈ క‌ష్టాలు వ‌చ్చేవి కావ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. కొంత ముందుగానే ప్ర‌క‌టించి ఉంటే.. అందుకు అనుగుణంగానే తమ కార్య‌క‌లాపాను నిలిపివేసేవాళ్ల‌మ‌ని అంటున్నారు. ప్ర‌జాహితం కోసం తీసుకున్న నిర్ణ‌యం అయిన‌ప్ప‌టికీ.. త‌మ ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌నక‌రంగా మారుతోందని అంటున్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: