నారాయణ విద్య సంస్ధల యాజమాన్యానికి మరీ ఇంత కక్కుర్తి పనికిరాదు. యావత్ దేశమంతా కొరోనా వైరస్ దెబ్బకు మూడు వారాల పాటు లాక్ డౌన్ పాటిస్తున్నా ఆ నిబంధనలేవీ తనకు పట్టవని నారాయణ యాజమాన్యం అనుకుంటోంది. ప్రకాశం జిల్లాలోని కందుకూరులో రహస్యంగా ఓ విద్యార్ధిని ఇంట్లో పాఠాలు చెబుతుండటమే కక్కుర్తికి నిదర్శనంగా మారింది. అంటే ప్రభుత్వ ఆదేశాలు, నియమ, నిబంధనలను తాము లెక్క చేయాల్సిన అవసరం లేదని యాజమాన్యం అనుకోవటమే దీనికి కారణం.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ప్రకాశం జిల్లాలోని కందుకూరు పట్టణంలోని తూర్పు వడ్డెపాలెంలో నారాయణ స్కూలుంది. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మిగిలిన స్కూళ్ళలాగే ఈ యాజమాన్యం కూడా విద్యార్ధుల కోసం అదనపు తరగతులను నిర్వహిస్తోంది. అయితే హఠాత్తుగా కొరోనా వైరస్ సమస్య పెరుగుతున్న కారణంగా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం మూడు వారాల పాటు రాష్ట్రం మొత్తాన్ని లాక్ డౌన్ చేసేసింది.

 

అందుకనే పరీక్షలన్నింటినీ నిరవధికంగా వాయిదా వేసేసింది. రాష్ట్రం మొత్తాన్ని లాక్ డౌన్ చేయటంలో ఉద్దేశ్యం ఏమిటంటే జనాలు గుంపులుగా ఒక చోట చేరకూడదని. వైరస్ ఒకరినుండి మరొకరికి రాకూదని అనుకుంటే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల్లో  ప్రతి ఇద్దరికీ మధ్య కనీసం  మీటర్ సోషల్ డిస్టెన్సింగ్ ఉండేట్లు ఎవరికి వారు చూసుకోవటమే. అయితే స్కూళ్ళున్నా, పరీక్షలు నిర్వహిస్తున్నా సాధ్యం కాదు కాబట్టే పరీక్షలను వాయిదా వేసేసింది.

 

సరే ప్రభుత్వం ఆదేశాలిచ్చింది కాబట్టి అన్నీ యాజమాన్యాలు స్కూళ్ళను మూసేశాయి. అయితే నారాయణ యాజమాన్యం మాత్రం పట్టణంలోనే ఉన్న ఓ విద్యార్ధిని ఇంటికే మిగిలిన విద్యార్దినులను పిలిపించి రహస్యంగా క్లాసులు తీసుకుంటున్నారు. దాదాపు 25 మందికి విద్యార్ధినులకు 5 మంది టీచర్లు క్లాసులు తీసుకుంటున్నారు. ఈ విషయం గ్రామ వాలంటీర్ కు తెలియగానే వెంటనే పోలీసులకు కబురు చేశారు. దాంతో విషయం బయటపడింది. క్లాసులు జరుగుతున్న ఇంటి మీదకు పోలీసులు దాడి చేసి విద్యార్ధినులను ఇళ్ళకు పంపేసి టీచర్లను పోలీసు స్టేషన్లకు తీసుకెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: