ఏపీలోని మెడికల్ షాపులలో మందుల కొరత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సరఫరా ఆగిపోవడంతో మందుల కొరత ఏర్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కావడంతో రవాణా ఎక్కడికక్కడే నిలిచిపోయింది. లాక్ డౌన్ పరోక్షంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. విజయవాడ నగరంలోని నక్కల్ రోడ్ లోని పదుల సంఖ్యలో మెడికల్ షాపులు ఉంటాయి. 
 
కానీ ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్స్ నుంచి సరఫరా లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మెడికల్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి సరఫరా ఆగిపోవడంతో మందుల కొరత ఏర్పడిందని... ప్రభుత్వం మందుల సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు సరఫరా చేయడం లేదని చెబుతున్నారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో మందుల లభ్యత లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్న తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో ఒక యువకునికి కరోనా పాజిటివ్ అని తేలింది. లండన్ నుంచి శ్రీకాళహస్తి వచ్చిన యువకునికి కరోనా అని తేలడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. 
 
పోలీసులు శ్రీకాళహస్తి పట్టణానికి పూర్తిగా రాకపోకలను నిలిపివేశారు. యువకుని కుటుంబ సభ్యులు, స్నేహితుల వివరాలు సేకరించి వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. చిత్తూరులో తొలి పాజిటివ్ కేసు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ప్రజలు పూర్తికే ఇళ్లకే పరిమితమయ్యారు. స్వచ్చందంగా ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తున్నారు. ఏపీలో ఇప్పటివరకూ 8 పాజిటివ్ కేసులు నమోదు కాగా తెలంగాణలో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.            

మరింత సమాచారం తెలుసుకోండి: