దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోన్న విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటివరకూ 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఏపీలో 8 కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కరోనా కట్టడిలో భాగంగా ప్రధాని మోదీ మూడు వారాల పాటు దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. కరోనా నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
రీడింగ్ లేకుండా వినియోగదారులకు కరెంట్ బిల్ వేయనున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గతంలోలా సంస్థ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి... రీడింగ్ తీసుకుని... స్పాట్ బిల్లింగ్ ఇచ్చే సేవలను విద్యుత్ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది. వినియోగదారులు గత మూడు నెలల్లో వినియోగించిన విద్యుత్ వినియోగాన్ని బట్టి విద్యుత్ శాఖ బిల్లును నిర్ణయించనుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యుత్ శాఖ చెబుతోంది. 
 
ఉద్యోగుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని విద్యుత్ శాఖ కరెంట్ బిల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులు ఆన్ లైన్ లో వెబ్ సైట్ లోకి వెళ్లి బిల్లులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. విద్యుత్ బిల్లులను ఆన్ లైన్ ద్వారానే వినియోగదారులు చెల్లించాలని విద్యుత్ శాఖ కోరింది. ఒకవేళ బిల్లులో ఏమైనా తేడాలు ఉంటే తర్వాత నెల బిల్లులో సర్దుబాటు చేయనున్నారు. 
 
మరోవైపు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడంపై అధికారులపై సీరియస్ అయ్యారని సమాచారం. నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. పోలీసులు రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. నిబంధనలను పాటించని వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు... వాహనాలను సీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: