వైద్యులు, సిబ్బంది ఆరువేల మందిని ఓపీలో చూశారు. మరో వందమంది ఇన్‌ పేషంట్‌ లుగా, ఐసీయూ పేషంట్‌ లుగా ఉన్నారు. వారందరి పరిస్థితేంటి? వారిలో ఎవరికైనా వైరస్‌ ఎటాక్‌ అయి ఉంటే... వారినుంచి ఎంతమందికి వచ్చి ఉంటుంది? ఊహించటానికి కూడా భయం వేసే పరిస్థితి ఇది. 

 

భిల్వారాలోని ఆ ప్రైవేట్ ఆస్పత్రి స్థానికంగా చాలా పాపులర్. రోగులు వందల సంఖ్యలో వస్తుంటారు. ఆ వారం పదిరోజుల్లో దాదాపు 6వేల మంది అక్కడ ఓపీలో చికిత్స తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా స్థానికుల్లో ఆందోళన మొదలయింది. దీంతో భిల్వారాలో కర్ఫ్యూ విధించారు. ప్రజల్ని బయటికి రాకుండా నిరోధించారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు మూసేశారు. జిల్లానుంచి ఇతర ప్రాంతాలకు రాకపోకల్ని నిషేధించారు. ఆస్పత్రికి సీల్ చేసి, రోగుల్ని ఇతర ఆస్పత్రులకు తరలించారు. 

 

ఇప్పుడు భిల్వారా కరోనా భయంతో వణుకుతోంది.
కరోనా రోగితో పాటు ఐసీయూలో ఉన్న వారి పరిస్థితేంటి?
ఓపీలో పరీక్షలు చేయించుకున్న 6,192మంది రోగుల సంగతేంటి?
వీరిలో వైరస్ ఎవరికైనా వచ్చి ఉంటే... వాళ్లనుంచి ఎంతమందికి వ్యాపించి ఉంటుంది? ఆస్పత్రిలో ఇన్ పేషంట్లుగా ఉన్న 88మంది ఎలా ఉన్నారు?
ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలే. 
వీరిలో ఎందరికి కరోనా వైరస్ వస్తుందో, ఎందరు సేఫ్ గా ఉంటారో అనేది ఇంకా తేలాల్సి ఉంది. దీంతో దాదాపు నాలుగు లక్షల జనాభా  ఉన్న భిల్వారా ఇప్పుడు భారత్ లో కరోనాకు భారీ కేంద్రగా మారనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

 

ఓ పక్క ప్రపంచమంతా కరోనాతో గగ్గోలు పెడుతుంటే, దేశంలో అప్పటికే కేసులు పెరుగుతున్న తరుణంలో కూడా మూడు ఆస్పత్రుల వైద్యులు న్యుమోనియా లక్షణాలున్న పేషంట్ కు కరోనా పరీక్షచేయకపోవటం ఇక్కడ కనిపిస్తున్న ప్రధాన నిర్లక్ష్యం. దాని ఫలితం లక్షల మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. 

 

ఇప్పటివరకు భిల్వారాలో 69మందిని పరీక్షిస్తే, 13మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వీరిలో ముగ్గురు వైద్యులు, 9మంది హెల్త్ వర్కర్స్ ఉన్నారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది 31మందినీ ఐసోలేషన్ లో ఉంచారు. అయితే ఈ లోపు అక్కడికి వైద్యం కోసం దాదాపు 13 జిల్లాల నుండి వచ్చిన ఆరువేల192 మంది పరిస్థితేంటనేది ఇప్పుడు అసలు ప్రశ్న. వీరిలో 39మంది ఇతర రాష్ట్రాల వారు కూడా ఉన్నారు. దీంతో దేశం మొత్తానికి కరోనా కేంద్రంగా భిల్వారా మారే ప్రమాదం ఉందనే ఆందోళన పెరుగుతోంది. 

 

ప్రస్తుతానికి పట్టణాన్ని పూర్తిగా దిగ్భందించారు. అయితే ఇక్కడ మరికొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. న్యుమోనియాతో చనిపోయిన పేషంట్ కాకుండా, వేరెవరైనా కరోనా వైరస్ తో ఇక్కడ వ్యాపించటానికి కారణమయ్యారా అనేది కూడా సమాధానం తేలని ప్రశ్న. మరోపక్క ఇన్ఫెక్షన్ వచ్చిన డాక్టర్లలో ఒకరి ఇంటికి సౌదీ నుంచి గెస్టులు వచ్చారనే వాదనలున్నాయి. వారిలో ఎవరి నుంచైనా కరోనా వచ్చి ఉండొచ్చా..? అందర్నీ ట్రేస్ చేసి పరీక్షిస్తే తప్ప ఇది తేలదు. అయితే డాక్టర్లు మాత్రం పేషంట్లు తమ ట్రావెల్ హిస్టరీ చెప్పకుండా ట్రీట్ మెంట్ కు రావటం వల్లనే ఇదంతా జరిగి ఉండొచ్చని వాదిస్తున్నారు. 

 

ఇప్పుడు భిల్వారాలో 300టీమ్ లు పనిచేస్తున్నాయి. హెల్త్‌ వర్కర్లు 78వేల ఇళ్లకు తిరుగుతూ, పరీక్షలు చేస్తున్నారు. భిల్వారా ఘటన ఇప్పుడు దేశంలోని వందలు వేల ఆస్పత్రుల్లో ఉన్న పొంచి ఉన్న ప్రమాదానికి అద్దం పడుతోంది. భిల్వారా ఒక్కటే కాదు.. ఇప్పుడు దేశంలోని అనేక ఆస్పత్రులు కరోనా వ్యాప్తికి కేంద్రాలుగా మారే డేంజర్‌ కనిపిస్తోంది. సరైన మాస్కులు, గౌన్ లు, కనీసం శానిటైజర్లు లేని ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది కరోనా ప్రమాదంలో ఉన్నారు. వాళ్ల నుంచి  ఎన్నివేల మంది రోగులకు కరోనా వ్యాపిస్తుందో.. దేశంలో కరోనా కరాళ నృత్యం ఏ స్థాయిలో ఉండనుందో అనే ఆందోళనలు పెరుగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: