ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత కోట్ల మంది ప్రజలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. లాక్ డౌన్ ప్రకటించే ముందుగా ఎటువంటి సమాచారం తెలియజేయకపోవడంతో చాలామంది ప్రస్తుతం సరిపడినన్ని నిత్యవసర సరుకులు, కూరగాయలను కొనుగోలు చేయలేక, మందులు, డబ్బులు తీసుకోవడానికి బయటికి వెళ్లలేక దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అలాగే దుకాణాలన్నీ పోలీసులు బంద్ చేయడంతో వలస వచ్చిన వర్కర్లంతా ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడగా... ఒక్క బస్సు గానీ, రైలు గానీ లేకపోవడంతో వారంతా వందల కిలోమీటర్లు నడిచే వెళ్తున్నారు. 

 

 

నిన్న సాయంత్రం పే-ద్ద ప్రసంగం ఇచ్చిన మోడీ ఇంట్లో కూర్చోండి అని చెప్పాడే తప్ప... కూలీనాలీ చేసుకునే వారి కోసం గానీ, చిన్నాచితకా వ్యాపారులు కోసం ఓ పైసా బిళ్ళ కూడా ఇస్తానని చెప్పకపోవడం దురదృష్టకరం. అలాగే నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదని అతని ప్రసంగంలో చెప్పకపోవడం ఇంకో బాధాకరమైన విషయం. మొత్తం అయిపోయిన తర్వాత సామాజిక మాధ్యమాలలో మీరేం భయపడకండి నిత్యవసర సరుకులు దొరుకుతాయని నామమాత్రంగా చెప్పేసాడు. ఐతే చాలా ప్రాంతాలలో కఠినమైన పోలీసులు మాత్రం నిత్యావసర సరుకుల కొనుగోలు చేయడానికి వెళ్లే వారిని నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. కేవలం మూడు కిలోమీటర్ల పరిధిలో కూరగాయలు, బియ్యం దొరకని వారి పరిస్థితి వర్ణనాతీతం. 

 

 

 

ఐతే రాజకీయ నేతలు, పోలీసుల విషయం కాసేపు పక్కన పెడితే... లాక్ డౌన్ సమయంలో తెగ ఓవరాక్షన్ చేస్తున్నారు కొంతమంది చదువురాని టీవీ రిపోర్టర్లు. వీళ్ళకి పర్మిషన్ ఉంది కదా అని కనీసం మాస్కులు కూడా ధరించకుండా రోడ్ల మీదకి యథేచ్ఛగా వచ్చేసి పోలీసుల కంటే ఎక్కువగా ప్రజలను వేధిస్తున్నారు. 'అరే, ఎమర్జెన్సీ సర్వీస్ అండి' అని చాలామంది ఉద్యోగులు చెప్తున్నా... 'మీరు బయటికి ఎందుకు వస్తున్నారు? ప్రధాని మోడీ చెప్పిన తర్వాత కూడా మీకు అర్థం కావట్లేదా? మీ మంచి కోసమే చెప్తుంటే మీకు మైండ్ కి ఎక్కదా?' అంటూ ఎవడి ఇష్టారాజ్యంగా వాడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. ఎవరు ఏ అవసరం కోసం రోడ్లమీదకు వచ్చారో తెలియకుండా ఇలా ఇష్టారాజ్యంగా రిపోర్టర్లు ప్రవర్తించడం అందరి ఆగ్రహానికి కారణం అవుతుంది. 

 


ఒక సంఘటన గురించి తెలుసుకుంటే... మార్చి 24 వ తేదీన రిపబ్లిక్ టీవీ రిపోర్టర్... ఢిల్లీ-నోయిడా ని కలిపే ఓ ఫ్లైఓవర్ మీదకి వచ్చి విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అక్కడ ఒక పోలీసు బృందం కూడా ఉండి ఫ్లై ఓవర్ మీద ప్రయాణించే వారిని ఆపి వాళ్ళు ఎందుకు రోడ్ల మీదకి వచ్చారో తెలుసుకుంటున్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బందిని, ఇంకా ఎవరైనా అత్యవసర పరిస్థితిలో ఉన్న వారిని తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు దారి విడుస్తున్నారు పోలీసులు. ఐతే అదే సమయంలో ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హాస్పటల్ డైరెక్టర్ సీనియర్ డా. అనీష్ సింఘాల్ తన పని నిమిత్తం ఫ్లైఓవర్ పై చెక్ పాయింట్ దాటేందుకు ప్రయత్నిస్తుండగా... పోలీసులు అతన్ని ఆపారు. దాంతో ఆ సీనియర్ డాక్టర్ తన ఐడి(గుర్తింపు కార్డు) ని చూపించబోయారు. కానీ అంతలోనే ఈ రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ మధ్యలో జోక్యం చేసుకొని సీనియర్ డాక్టర్ తో చాలా దురుసుగా ప్రవర్తిస్తూ... 'నీకు సామాజిక బాధ్యత లేదా?' అంటూ ప్రశ్నించాడు. అంతటితో ఆగకుండా ఆ డాక్టర్ ఐడి ని కూడా గుంజుకొని అది ఓ ఇన్సూరెన్స్ కంపెనీది అని, ఇంకా ఓ ఫేక్ ఐడి కార్డ్ అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఐతే ఈ దృశ్యాలని సదరు టీవీ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ... డాక్టర్ అనీష్ సింఘాల్ ని ఉద్దేశిస్తూ ఓ వ్యక్తి ఫేక్ ఐడీ కార్డుతో లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు అంటూ స్క్రోలింగ్ ఇచ్చింది. 

 

 


దాంతో ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హాస్పటల్ యాజమాన్యం ప్రకటన విడుదల చేసి... కనిపిస్తున్నది తమ ఆసుపత్రి యొక్క సీనియర్ డాక్టర్ అనీష్ సింఘాల్ అని, మూడు వందల అత్యవసర కేసుల్ని ఆయన పరీక్షిస్తున్నారని... అటువంటి వ్యక్తితో రిపబ్లిక్ టీవీ రిపోర్టర్ గొడవ పడటం చాలా బాధాకరమని... మీడియా అనేది ముఖ్యమే కానీ అత్యవసర సర్వీసులను ఇబ్బంది పెట్టకండని విజ్ఞప్తి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: