కరోనా భయం జనాలను వెన్నాడుతోంది. దేశాలు, రాష్ట్రాల మధ్య బోర్డర్స్‌ను మూసివేసినట్లే.. గ్రామాల మధ్య సరిహద్దులను కూడా స్థానికులే క్లోజ్‌ చేస్తున్నారు. ఎక్కడికక్కడ కంచెలు ఏర్పాటు చేసి రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. పగలూ రాత్రి పహారా కాస్తున్నారు గ్రామస్థులు. 

 

పచ్చని పల్లె సీమల్లోనూ కరోనా భయం ఏ స్థాయిలో ఉందో ఈ కంచెలే అద్దం పడతున్నాయి. ప్రభుత్వం  లాక్‌డౌన్‌లకు చర్యలు తీసుకుంటుంటే.. పల్లె ప్రజలు తమ గ్రామాలనే లాక్‌ చేస్తున్నారు. ఊళ్లకు ఉండే సరిహద్దులను ఇలా కంచెలతో మూసివేస్తున్నారు. బయటి వ్యక్తులను ఊళ్లోకి రానివ్వడం లేదు. ఊళ్లోని వాళ్లను అవసరమైతే తప్ప బయటకు వెళ్లడానికి ఒప్పుకోవడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 24 గంటలుగా  కనిపిస్తున్న దృశ్యాలివి. ఈ విషయం తెలుసుకున్న ఇతర గ్రామాల ప్రజలు కూడా తమ ఊరిలోకి కరోనా చొరబడకుండా ఇలాగే కంచెలు పెడుతున్నారు. 

 

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కొండపేటలో ముళ్ల కంచెలు వేసేశారు. తమ ఊరిలోకి ఎవరూ రావొద్దని వేడుకొంటున్నారు. 

 

విజయనగరం జిల్లా కురుపాం ఏజెన్సీలో గిరిజనులు సైతం కరోనా భయంతో తమ గ్రామాల్లోకి ఎవరూ రాకుండా.. రాకపోకలు సాగించకుండా చెట్లను నరికి రోడ్లపై అడ్డంగా వేశారు.

 

విశాఖ జిల్లా అరకులోనూ చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 20 గ్రామల ప్రజలు ఇదే బాట పట్టారు. 
పశ్చిమ గోదావరి జిల్లాలోని చాలా పల్లెల్లో బయటి వ్యక్తులను తమ పల్లెల్లోకి రానివ్వడం లేదు. గ్రామ సరిహద్దుల్లో కంచెలు ఏర్పాటు చేసి.. ప్రత్యేక నిఘా పెట్టుకున్నారు. 

 

ప్రకాశం జిల్లాలో అయితే ముళ్లకంపలు వేసి.. ఎవరూ రావొద్దని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కరోనా ప్రభావం తగ్గే వరకూ బయటి వారికి ఊరిలోకి అనుమతి ఉండదని ముఖం మీదే  కుండబద్దలు కొట్టి చెప్పేస్తున్నారు. 

 

తెలంగాణలోని పల్లెల్లోనూ ప్రజలు కరోనా వైరస్‌ ప్రబల కుండా ఇదే విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఊరు చూట్టూ ముళ్లకంచెలు వేశారు. ఊరిలోని వారు బయటకు వెళ్లకుండా.. బయటి వారు ఊరిలోకి రాకుండా కొందరితో నిఘా ఏర్పాటు చేశారు. 

 

వికారాబాద్‌ జిల్లాలో ఎక్కడికక్కడ రోడ్లపై ముళ్ల కంచెలు దర్శనం ఇస్తున్నాయి. కొందరు అక్కడే కూర్చుని అటూ ఇటూ వెళ్లేవారిని ఆరా తీస్తున్నారు. 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగరం మండలం జామ్లాతండా వాసులు ఇళ్లను బయటకు రావడం లేదు. అలాగే పొలిమేర్లలో రహదారులు మూసివేసి కాపలా కాస్తున్నారు. 

 

యాదాద్రి భువనగిరి జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా  గుండాలలో యువకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఊరిలోకి ఎవరూ రాకుండా.. రోడ్డుకు అడ్డంగా తాళ్లు కట్టారు. 

 

మహబూబాబాద్‌ జిల్లాలో పల్లె రోడ్లపై  కంచెలు అడ్డంగా పెట్టి రాకపోకల్ని అడ్డుకుంటున్నారు.  బయటి నుంచి ఎవరు ఊర్లోకి వద్దామని ప్రయత్నించినా ఒప్పుకోవడం లేదు. 

 

నిజామాబాద్‌, నల్లగొండ, వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లోని చాలా గ్రామాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హెచ్చరికల ఫలితమో లేక.. ముందు జాగ్రత్తో తెలియదు కానీ.. పట్టణ ప్రజలకంటే పల్లె ప్రజల్లోనే లాక్‌డౌన్‌ చైతన్యం కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: