కరోనా వైరస్ తో అన్ని వర్గాలూ వణికిపోతుంటే.. ఖైదీలు మాత్రం పండగ చేసుకుంటున్నారు. కరోనా కారణంగా పలువురు ఖైదీల్ని విడుదల చేయాలని ప్రభుత్వాలు నిర్ణయించడంతో.. ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడిన వారందర్నీ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 

 

దేశంలో కరోనా విస్తరిస్తున్న తరుణంలో.. భారత్‌లో జైళ్ల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో రద్దీ తగ్గించేలా దోషులను స్పెషల్‌ పెరోల్‌, లేదా ఫర్‌లో కింద విడుల చేయాలని నిర్ణయించినట్లు హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు జైలు నిబంధనల్లో సవరణలు చేయనున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ని 24 గంటల్లో జారీ చేస్తామని వెల్లడించారు.

 

ప్రభుత్వ నిర్ణ యాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ రోజే ఆ ప్రతిపాదనల్ని అమలులోకి తీసుకురావాలని ఆదేశించింది. అలాగే వైరస్‌ తరుణంలో.. జైళ్లలో రద్దీ తగ్గించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇదే అంశం సుప్రీంకోర్టు పరిధిలో కూడా ఉందని తెలిపింది. అంటువ్యాధుల ప్రబలి జైళ్ల రద్దీ తగ్గించాల్సిన అవసరం ఏర్పడితే దోషికి 60 రోజుల పెరోల్ లేదా ఆదేశాల్లో పేర్కొన్నన్ని రోజులు ఫర్‌లో కల్పించేలా నిబంధనల్లో తాజాగా సవరణలు చేస్తున్నట్లు సమాచారం.

 

ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష విధింపబడి, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని అన్ని రాష్ట్రాలను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. కరోనా వైరస్ వ్యాప్తి తరుణంలో జైళ్లలో ఖైదీల సంఖ్యను తగ్గించాలని సుప్రీం పేర్కొంది. కమ్యూనిటీ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అలాంటి ఖైదీలను విడుదల చేయాలని తెలిపింది. మొత్తానికి కరోో వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వణికించేస్తుంటే.. ఖైదీల్లో మాత్రం ఆనందం నింపుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: