కరోనా కారణంగా ప్రజలకు కూరగాయలు, నిత్యావసరాల సమస్య ఎదురవుతున్న సంగతి తెలిసిందే. అందుకే.. ఇకపై నగరాలు, పట్టణాల్లో రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని సీఎం జగన్ సూచించారు. లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడ్డ నుంచి నిత్యావసరాల కోసం ప్రజలు రైతు బజార్లు, కిరాణ దుకాణాల ముందు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. జనాల రాకతో నిత్యావసర దుకాణాలు, రైతు బజార్లు, పండ్ల మార్కెట్ల వద్ద బాగా రద్దీ కనిపిస్తోంది.

 

 

అసలు లాక్ డౌన్ చేసిందే ఇలా జనం గుమికూడదని.. అందుకే.. జగన్ అధికారులకు కొన్ని సూచనలు చేశారు. ఒకే చోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగా కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతీ దుకాణం వద్ద సామాజిక దూరం పాటించేలా మార్కింగ్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన అధికారులు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైతు బజార్లలో ప్రజలు సామాజిక దూరంగా పాటించేలా మార్కింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

 

 

ఇదే సమయంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని జగన్ ఇచ్చిన పిలుపు మేరకు వారు కూడా రంగంలోకి దిగారు. బుధవారం ఉదయం నుంచే మంత్రులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అన్ని దుకాణాలు, రైతు బజార్ల వద్దకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. కూరగాయలు అధిక ధరలు అమ్మే దుకాణాలను సీజ్‌ చేయాలని అధికారులకు సూచిస్తున్నారు.

 

ఇలాంటి సమయాల్లో ఎవరో వచ్చి మనకు చెప్పాలని కాకుండా.. జనం కూడా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటిస్తే పరిస్థితులు సజావుగా ఉంటాయి. జనమంతా ఐక్యంగా కరోనాను ఎదుర్కోవలసిన సమయంలో కంగారు పడి పరిస్థితి మరింత దిగజారకుండా చూడాల్సిన బాధ్యత అందరిదీ.

మరింత సమాచారం తెలుసుకోండి: