రాష్ట్రం మొత్తంమీద విశాఖపట్నం జిల్లాలో  మాత్రమే కరోనా వైరస్ చాలా స్పీడుగా వ్యాపిస్తోంది. అందుకనే 12 జిల్లాలు కొరోనా వైరస్ వ్యాప్తిలో మొదటి దశలోనే ఉంటే విశాఖపట్నం జిల్లా మాత్రం రెండోదశకు చేరుకునేసింది. దీనికి కారణం ఏమిటంటే విదేశాల నుండి వచ్చిన వారు చాలా ఎక్కువమంది ఉండటమే. తాజా సమాచారం ప్రకారం జిల్లాకు  విదేశాల నుండి 3870 మంది వచ్చారు. వీరి వల్లే జిల్లాలో పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ జిల్లా రెండో దశలో ఉన్నట్లు ప్రభుత్వం ఆందోళన పడుతోంది.

 

జిల్లాలో కొరోనా వైరస్ సమస్య తీవ్రంగా ఉండబట్టే కేంద్రం కూడా లాక్ డౌన్ చేసిన 75 జిల్లాల్లో విశాఖపట్నంను కూడా చేర్చింది. రెండోదశ దాటి మూడోదశకు వెళితే పరిస్ధితి చెయ్యిదాటి పోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికార యంత్రాంగం ఎప్పటికిప్పుడు పరిస్ధితులను సమీక్షిస్తోంది. జిల్లాలోని ఎవరు కూడా మూడు వారాల పాటు ఇళ్ళను వదిలి బయటకు రావద్దని చాలా స్ట్రిక్ట్ గా వార్నింగులు ఇస్తున్నారు.  ఏపిలో తొమ్మిది కేసులుంటే అందులో ముగ్గురు విశాఖ జిల్లా వాళ్ళే.

 

కొరోనాలో మూడు దశలున్న విషయం అందరికీ తెలిసిందే. మొదటి దశలో వైరస్ సోకిన విదేశీయులున్నారు. రెండోదశలో విదేశాల నుండి వచ్చి కుటుంబసభ్యులకు, బంధువులకు, సన్నిహితులకు అంటించిన వారు. ఇక మూడోదశ ఏమిటంటే కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ద్వారా జనాలందరికీ సోకటం. మొదటి రెండుదశల్లో కాస్త పర్వాలేదు కానీ మూడోదశకు చేరుకుంటే మాత్రం కష్టమనే చెప్పాలి. అదికూడా చిన్నపిల్లలు, వయసు అయిపోయిన వారైతే ఇంకా ఇబ్బందే.

 

విదేశాల నుండి వచ్చిన వారు ఎక్కువగా విశాఖపట్నం అర్బన్ మండలంలో 649 మంది, గాజువాకలో  476,  గోపాలపట్నంలో 299, మహరాణిపేటలో 247, విశాఖపట్నం రూరల్ మండలంలో  245, పెందుర్తిలో 177, ములగాడలో 166, పెదగంట్యాడలో 97, అనకాపల్లి రెవిన్యు డివిజన్లో 412, నర్సీపట్నం డివిజన్లో 160, పాడేరు డివిజన్లో 23, కార్పొరేషన్ పరిధిలో 745 మందిని జిల్లా యంత్రాంగం గుర్తించింది. జిల్లా అధికారులకు అందిన అడ్రస్ ల ప్రకారం విదేశాల నుండి వచ్చిన వారిని కలుద్దామంటే సాధ్యం కావటం లేదు.  అందుకనే ఇంటింటి సర్వే చేయిస్తున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: