ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం వల్ల భారతదేశం మొత్తం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ కరోనా ప్రభావం కాస్త తక్కువగానే ఉన్న ఏపీలో కూడా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా వ్యాప్తి పెరగకుండా ముందు జాగ్రత్తలు చర్యలో భాగంగా సీఎం జగన్, రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు. అయితే ఈ కరోనా ప్రభావం వల్ల ఏపీలో రాజకీయాల్లో పెద్ద హీట్ లేకుండా పోయింది. ఈ కరోనా దెబ్బవల్ల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక దీంతో పార్టీలు రాజకీయం పక్కనబెట్టి, కరోనా పట్ల ప్రజలని అప్రమత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు.

 

అయితే ఈ కరోనా ప్రభావం వల్ల రాజకీయ పరంగా టీడీపీకి కాస్త రిలీఫ్ దొరికింది. అసలు ఈ కరోనా పెద్దగా లేని సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఇక ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ స్థానాలకు నామినేషన్స్ కూడా పడ్డాయి. ఈ నామినేషన్స్ సమయంలో వైసీపీకి దాదాపు 20  శాతంపైనే ఏకగ్రీవాలు అయ్యాయి.  పైగా ఎన్నికలు జరిగిన వైసీపీకి టీడీపీ పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదు. దాంతో దాదాపు 80శాతం పైనే స్థానాలు వైసీపీ ఖాతాలో పడేవి.

 

కానీ ఒక్కసారిగా కరోనా ప్రభావం పెరగడంతో ఎలక్షన్ కమిషనర్ ఎన్నికలు వాయిదా వేశారు. దీంతో టీడీపీ కాస్త ఊపిరి పీల్చుకుంది.  అలాగే స్థానిక ఎన్నికలు సమయంలో టీడీపీ నేతలు వరుస పెట్టి వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితే ఈ వలసలకు కూడా బ్రేక్ పడింది. ఒకవేళ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఉండి ఉంటే... అనేక మంది నేతలు ఆ పార్టీలోకి వెళ్లి ఉండేవారనే చర్చ జరుగుతోంది.

 

అయితే కరోనా ప్రభావం తగ్గగానే ఎన్నికలు జరగడం ఖాయం. ఇక అప్పుడు మాత్రం టీడీపీకి కష్టకాలం  మళ్ళీ కొనసాగడం ఖాయమని చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికైతే కరోనా వల్ల టీడీపీకి లాభం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: