మోడీ తప్పు చేశారా. అది పెద్ద నోట్ల రద్దు లాంటి తప్పేనా. మోడీ రెండవ సారి బంపర్ మెజరిటీతో ఈ దేశానికి ప్రధానిగా వచ్చారు. వరసగా ఫుల్ మెజారిటీతో గెలవడం అంటే ఇందిరా గాంధీ తరువాత ఆ క్రెడిట్ మోడీకే సాధ్యమైంది. అటువంటి మోడీ తెలివైన నేత అంటారు. ప్రపంచంలోని అందరి నాయకుల చేత ఆయన గ్రేట్ అని  కితాబులు అందుకున్నారు.

 

మోడీ చేతిలో ఈ దేశం సేఫ్ అని మొత్తానికి మొత్తం 130 కోట్ల మంది ప్రజలు భావిస్తారు. మోడీ దూరద్రుష్టితో నిర్ణయాలు తీసుకుంటారని పేరు. అటువంటి మోడీ కరోనా వైరస్ విషయంలో తెలిసో తెలియకో తప్పు చేశారని మేధావులే కాదు, ప్రపంచ ఆరోగ్య నిపుణులు అయితే మోడీ కరోనా వైరస్ విషయంలో ఇంకా ముందుగా మేలుకోవాల్సింది అంటున్నారు.

 

ఎందుకంటే కరోనా వైరస్ అన్న మాట ప్రపంచానికి తెలిసింది డిసెంబర్ 1 నుంచే. అప్పుడే చైనాలోని ఊహాన్ నగరాన్ని కరోనా గడగడలాడిస్తోంది. ఆ తరువాత జనవరి నుంచి ఇతర దేశాలకు దాని విస్తరణ  మొదలైంది. అంటే ఇప్పటికి సరిగ్గా మూడు నెలలు. భారత్ ఆ టైంలో కనీసం కరోనా గురించి ఆలోచనే ఎవరూ  చేయలేదు.

 

అది అలా పాక్కుంటూ అనేక దేశాలు  తిరిగుతూ వస్తూంటే భారత్ మాత్రం ఎందుకో పట్టనట్లుగా ఉండిపోయింది.  ఇక ఫిబ్రవరి నెల వచ్చింది. అపుడు కూడా మోడీ సర్కార్ ఆ విషయం గురించి ఆలోచించకుండా అమెరికా ప్రెసిడెంట్ ఇండియా టూర్ కోసం ఏర్పాట్లు చేసుకుంటూ అందులో మునిగిపోయింది. ట్రంప్ వచ్చి వెళ్ళడం ఆ ముచ్చట ముగిసేసరికి  ఫిబ్రవరి కూడా మెల్లగా వెళ్ళిపోయింది.

 

ఇక మార్చి నుంచి అయినా గట్టిగా ఆలోచించారా అంటే అదీ లేదు. మార్చి మొదటి వారం తరువాతనే కేంద్ర సర్కార్ కి చురుకుదనం పుట్టిందని విమర్శలు ఉన్నాయి. అప్పటికి కరోనా భారత్ లో రెండవ దశకు ఎంటరైంది. అంటే విదేశాల్లో ఉంటున్న వారంతా భారత్ కి పెద్ద ఎత్తున  వచ్చేసారన్న మాట. ఇక ఇపుడు మోడీ చాలా వేగంగా రియాక్ట్ అవుతున్నారు. మూడవ దశకు చేరకుండా దేశానికే  లాక్ డౌన్ ప్రకటించేశారు.

 

ఇది బాగానే ఉంది కానీ అసలు కరోనా వైరస్ వ్యాప్తి  రెండవ దశకు చేరకుండానే జాగ్రత్త పడితే దేశమంతా తలుపులు బిడాయించుకుని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి తప్పేది కదా అన్నది దేశంలోని ఆర్ధిక వేత్తలతో పాటు, ప్రపంచ దేశాల భావన. ఇక కరోనాపైన ఇపుడు దేశ పెద్దలు పడుతున్నా ఆరాటం చూస్తున్న ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఇప్పటికైనా మేలుకోవడం మంచిదే కానీ ఏమైనా భారత్ కి  రిస్క్ ఇంకా ఉందనే అంటున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలు దేశంలో కరోనా అనుమానితుల కేసులపై పరీక్షలు చాలా తక్కువ జరిగాయని.

 

మార్చి 18 నాటికి కేవలం 11 వేల మందికి  మాత్రమే విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేశారు. అంటే పరీక్షలకు అందని అతి పెద్ద సంఖ్య ఇపుడు భారత జన జీవన స్రవంతిలో కలసిపోయింది. మరి లాక్ డౌన్ వల్ల కరోనా మహమ్మారి  విస్తరణ తగ్గి ఇలాంటి అనుమానిత కేసులు బయటకు వచ్చినట్లైతే మూడవ దశ నుంచి భారత్ గట్టెక్కినట్లే. అదే జరగాలని అంతా కోరుకోవాలిపుడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: