తెలంగాణలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 41కు చేరింది. కేసీఆర్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో లాక్ డౌన్, రాత్రి పూట కర్ఫ్యూ ద్వారా కరోనాను మరింత కట్టడి చేయాలని సూచించారు. ఏ కారణం లేకుండా రోడ్లపైకి వచ్చేవారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే మాత్రమే కరోనా నుంచి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. 
 
ప్రజలు రాష్ట్రానికి విదేశాల నుంచి వచ్చిన వారు, వారి సన్నిహితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్వారంటైన్ లో ఉన్నవారి విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పకడ్బందీగా లాక్ డౌన్ లు, కర్ఫ్యూలు సరిగ్గా అమలవుతున్నాయని... రాబోయే రోజుల్లో మరింత పగడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. సామాజిక దూరం పాటించి కరోనా భారీన పడకుండా కాపాడుకోవచ్చని సూచించారు. 
 
కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్న వైద్యులను, పోలీస్ సిబ్బందిని, పారిశుధ్య కార్మికులను సీఎం అభినందించారు. ప్రజా ప్రతినిధులు ప్రజలను చైతన్యపరచాలని... కరోనా నిర్మూలనలో వీరిదే ప్రధాన బాధ్యత అని సీఎం అన్నారు. కరోనాను నిరోధించేందుకు కృషి చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. సీఎం కేసీఆర్ తాజా ఆదేశాలతో పోలీసులు నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. 
 
రాష్ట్రంలో నిన్న రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సౌదీ నుంచి వచ్చిన మూడేళ్ల చిన్నారి, 43 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. పోలీసులు రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉన్నందున ఎవరూ ఇళ్లు విడిచి వెళ్లొద్దని సూచించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులను హాస్టళ్ల నుండి ఎట్టి పరిస్థితులలోను బయటకు పంపొద్దని అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: