ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ కరోనా వైరస్ గజగజా వణికిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 41కు చేరింది. నిన్న రాత్రి 8 గంటలకు రాష్ట్రంలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ప్రభుత్వం కొద్దిసేపటికే రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రకటన చేసింది. 
 
రాష్ట్రంలో ఒక మహిళకు, మూడేళ్ల బాలుడికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి సీఎం కేసీఆర్ కఠిన నిర్ణయాలను అమలు చేస్తూనే ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలు ఇళ్ల వద్దే కూరగాయలు కొనే సదుపాయాన్ని కల్పించింది. ప్రభుత్వం రాష్ట్రంలో సంచార రైతుబజార్లను అందుబాటులోకి తీసుకురానుంది. 
 
నేటి నుంచి ప్రజలకు కూరగాయలు అందుబాటులోకి రానుండగా రేపటినుండి నిత్యావసరాలు, పాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. మార్కెటింగ్ శాఖ ఇప్పటికే నగరాలు, పట్టణాలలో ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా తోపుడు బండ్ల ద్వారా నిత్యావసర వస్తువులు ప్రజలకు అందేలా చర్యలు చేపడుతోంది. 
 
రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వాలు కరోనా కట్టడికి తగిన చర్యలు చేపడుతున్నా కొత్త కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. ఏపీలో నిన్న రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 10కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: