ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా అనే కంటికి కనిపించని సూక్ష్మజీవి గుప్పిట్లో ఉందని చెప్పవచ్చు. అది చెప్పిందే ప్రపంచం చేస్తుంది. అది చెప్పిందే ప్రపంచం వింటోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయం అంతా ఇంతా కాదు. తెలంగాణాలో లాక్ డౌన్ నేపథ్యంలో మాట వినకపోతే షూట్ చేయడానికి వెనకాడబోమని, ఆర్మీని దించాల్సిన పరిస్థితి తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి అన్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

 

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో  ఏప్రిల్ 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఎవరూ బయటికి వెళ్లొద్దని.. ఇంటికీ పరిమితం కావాలని సూచించారు. దీంతో మరో 20 రోజులు లాక్ డౌన్  విధించడంతో హైదరాబాద్ నగరంలో హస్టళ్లు మూసివేస్తున్నారని ప్రచారం జరుగుతుండటంతో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు  ఆందోళనకు  గురయ్యారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా.. స్వస్థలాలకు వెళ్లేందుకు వారికి అనుమతి పత్రాలు కూడా జారీ చేసారు.

 

అయితే దీనిపై స్పందించిన తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి... లాక్‌డౌన్‌ నేపథ్యంలో హాస్టళ్లలో ఉండే వారిని ఖాళీ చేయించొద్దని నిర్వాహకులకు  సూచించారు. ప్రభుత్వ నియమాలు, ఆదేశాలు ఉల్లంఘిస్తే అన్ని హాస్టల్స్‌, పీజీ మేనేజ్‌మెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.  ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చిన అనుమతి పత్రాలేవీ చెల్లవని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులతో మాట్లాడాలని మహేందర్‌రెడ్డి డీజీపీ ఆదేశించారు. ఇక హాస్టల్‌లో ఉండే విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు పంపొద్దని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో సొంత ఊర్లకు వెళ్లాలని ఆశపడిన స్టూడెంట్స్, ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. ఇప్పటికే హాస్టల్స్ పీజీలు మూసివేసిన యాజమాన్యం డీజీపీ నిర్ణయంతో ఏమి చేస్తారో మరి. కరోనాపై భారత దేశం యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధం దేశ భవిష్యత్తుకు చాలా కీలకమైంది. ఈ 21 రోజుల యుద్ధంలో ఎంత వరకూ విజయం సాధిస్తుందన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: