తెలంగాణాలో  ప్రత్యేకించి హైదరాబాద్ లోని వేలాదిమంది జనాలను కొరోనా వైరస్ చాలా ఇబ్బందులే పెట్టింది. ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల కారణంగా ఒక్కసారిగా వేలామంది  రోడ్డు మీదపడ్డారు. కొరోనా వైరస్ దెబ్బకు హైదరాబాద్ లోని హాస్టళ్ళు, మెస్సులు, యూత్ హాస్టళ్ళు మూసేయటంతో అందులో ఉంటున్న వేలాదిమంది  రోడ్డు మీద పడ్డారు.  ఒకవైపు అన్నీ మూతపడటం మరోవైపు రవాణా సౌకర్యాలు రద్దు కావటంతో ఏమి చేయాలో వీళ్ళెవరికీ అర్దం కాలేదు. ఇక అక్కడి నుండి సమస్యలు మొదలయ్యాయి.

 

ఎప్పుడైతే వేలామంది ఒక్కసారిగా రోడ్డుమీద పడ్డారో సోషల్ డిస్టెన్సింగ్ స్పూర్తి దెబ్బతినేసింది. నలుగురు ఒకచోట గుమిగూడ వద్దని ప్రభుత్వాలు మొత్తుకుంటున్న నేపధ్యంలో ప్రభుత్వాల ఆంక్షలను కాదని  ఒకేచోట వేలాది మంది జమవ్వటం గమనార్హం. ఎప్పుడైతే రోడ్డున పడిన వాళ్ళ గోల మీడియాలో రిలీ అవుతోందో ప్రభుత్వంపై ఒత్తిడి మొదలైంది. హైదారాబాద్ లో అన్నం పెట్టే దిక్కు కూడా లేకపోవటంతో అందరూ తమ ఊర్లకు వెళ్ళిపోవటానికి రెడీ అయిపోయారు.

 

పరిస్ధితిని గమినించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రోడ్డునపడ్డ వారితో మాట్లాడారు. చాలా గొడవలైన తర్వాత  మొత్తానికి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ జారి  చేసి వాళ్ళు సొంతూళ్ళకు వెళ్ళటానికి అనుమతించారు. మధ్యాహ్నం నుండి మొదలైన నో అబ్జక్షన్ సర్టిఫికేట్లు జారీతో వేలాది మంది తమ ఊర్లకు బయలుదేరారు. ఎదురైన అన్నీ చెక్ పోస్టులను దాటుకుని ఏపిలోకి ఎంటర్ అయ్యే ముందు జగ్గయ్యపేట దగ్గరున్న ఇంటర్ స్టేట్ చెక్ పోస్టు దగ్గర పోలీసులు వీళ్ళని నిలిపేశారు. నో అబ్జక్షన్ సర్టిఫికేట్లను చూపించినా అనుమతించేది లేదని తేల్చి చెప్పటంతో మళ్ళీ అక్కడ కూడా పెద్ద గొడవైంది. ఒకవైపు ఆందోళనకారులు మరోవైపు పోలీసులు ఇలా సుమారు 5 గంటల పాటు రోడ్లపైనే గొడవైంది.

 

చివరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ మాట్లాడుకున్న తర్వాత వివాదం పరిష్కారమైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉన్నపళంగా హాస్టళ్ళు, మెస్సులను మూసేస్తారని ఆలోచించకపోవటం ప్రభుత్వాల తప్పు. అలాగే వేలాది మంది విద్యార్ధులు వాళ్ళ సొంతూళ్ళకు  వెళ్ళటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయకుండా లాక్ డౌన్ అంటే వాళ్ళంతా ఏమైపోవాలి ? మెస్సులు, హాస్టళ్ళను మూసేయకుండా ముందుజాగ్రత్తగా యాజమాన్యాలతో మాట్లాడటంలో ప్రభుత్వం ఫెయిలైంది. ప్రభుత్వాలు చేసిన తప్పుకు వేలాదిమంది రోడ్డున పడాల్సొచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: