ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని చెక్ పోస్టుల దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చొటు చేసుకుంటున్నాయి. తెలంగాణ నుంచి ఏపీకు వస్తున్న అన్ని వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. తెలంగాణ ప్రభుత్వం నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిందని చెప్పినా పోలీసులు వాహనాలను అనుమతించటం లేదు. ఏపీలో సొంత గ్రామాలకు వెళ్లటానికి నిన్న రాత్రి నుంచి ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. 
 
ఒకేచోట జనం గుంపులు గుంపులుగా ఉండటంతో కరోనా సోకుతుందేమోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. తమ వాహనాలను ఏపీలోకి అనుమతించాలని పోలీసులను వేడుకుంటున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల సరిహద్దు దగ్గర పోలీసులు వాహనాలను అనుమతించటం లేదు. ఏపీలోకి రావాలంటే నూజివీడు ట్రిపుల్ ఐటీ క్వారంటైన్ లో 14 రోజులు ఉండాలన్న ఆంక్షలకు కొందరు విద్యార్థులు, ప్రయాణికులు అంగీకరించారు. 
 
తెలంగాణ నుంచి వచ్చిన 44 మంది విద్యార్థులు నూజివీడు క్వారంటైన్ లో ఉండటానికి అంగీకరించారని సమాచారం. నూజివీడు ట్రిపుల్ ఐటీలో క్వారంటైన్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ తిరువూరు సరిహద్దు దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని సమాచారం అందుతోంది. ఎవరైతే క్వారంటైన్ కు అంగీకరిస్తారో వారిని మాత్రమే అనుమతిస్తామని మిగతా వారిని అంగీకరించే ప్రసక్తే లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. 
 
నూజివీడు ట్రిపుల్ ఐటీలో పరీక్షలు నిర్వహించి వారిలో కరోనా లక్షణాలు లేకపోతే స్వస్థలాలకు పంపించనున్నారు. లక్షణాలు కనిపిస్తే మాత్రం అక్కడే వైద్య చికిత్స కొనసాగుతుందని చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నో అభెక్షన్ సర్టిఫికెట్లను జారీ చేయబోమని... హాస్టల్స్ ను తెరిపిస్తామని చెబుతోంది. మరోవైపు ఏపీలో ఇప్పటివరకూ 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: