ఉపాధి కోసం మహారాష్ట్ర వెళ్లిన తెలంగాణ వాసులు కేంద్రం లాక్ డౌన్ విధించడంతో అక్కడే చిక్కుకుపోయారు. నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, జనగామా జిల్లాలకు చెందిన 200 మంది ముంబై లోనే పని చేసుకుంటూ జీవిస్తున్నారు. దేశం మొత్తం లాక్ డౌన్ కావడంతో ఉపాధి కోల్పోయి వీరు ఇబ్బందులు పడుతున్నారు. సొంతూళ్లకు రావాలని ప్రయత్నిస్తున్నా అనుమతించకపోవడంతో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
నిత్యావసర సరుకులకు కూడా తమను రోడ్లపైకి అనుమతించడం లేదని... తమ బ్రతుకులు భారంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలో వీరు అద్దెకు ఉన్న ఇంటి ఓనర్లు కరోనా భయం నేపథ్యంలో ఖాళీ చేసి వెళ్లిపోవాలని వేధించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపించి తాము సొంతూళ్లకు చేరుకునేలా చేయాలని వారు వేడుకుంటున్నారు. గత ఆరు రోజుల నుంచి వీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. 
 
తెలంగాణ ప్రభుత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు తెలంగాణలో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న రాత్రి వరకు కరోనా బాధితుల సంఖ్య 41కు చేరింది. మరికొంతమంది అనుమానితులకు సంబంధించిన నివేదికలు అందాల్సి ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. 
 
అదే సమయంలో పేద ప్రజలు, హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు చేస్తోంది. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని 150 అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా పేద ప్రజలకు, హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా అందించేలా ఆదేశాలు జారీ చేశారు. సంచార రైతు బజార్ల ద్వారా ప్రభుత్వం ప్రజలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పాలు అందేలా చర్యలు చేపట్టారు.                                  

మరింత సమాచారం తెలుసుకోండి: