కృష్ణా జిల్లాలో జర్నలిస్టులపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. లాక్ డౌన్ సమయంలో జర్నలిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా పలు చోట్ల వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. హనుమాన్ జంక్షన్ లో జర్నలిస్టులపై దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు నిరసనగా హైవేపై జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. మీడియాను అడ్డుకోవద్దని పోలీసులకు సూచనలు ఇస్తున్నా పోలీసులు మాత్రం జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారు. 
 
ఐడీ కార్డులు చూపించినా తమపై దాడులకు పాల్పడటం ఏమిటని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్లిన వివిధ ఛానెళ్ల, పత్రికల విలేకరులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని సమాచారం. విలేకరులపై జరిగిన దాడి గురించి జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తమపై దాడులకు పాల్పడుతున్నారని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. 
 
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా వ్యవహరిస్తున్న మీడియాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర సర్వీసులుగానే పరిగణించాయి. జర్నలిస్టులు జిల్లా ఎస్పీ రవీంద్రబాబును కలిసి ఈ ఘటన గురించి ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దాడి చేసిన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. 
 
లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించడానికి వెళ్లిన జర్నలిస్టులు తాము ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని  చెబుతున్నారు. ఉన్నతాధికారులు ఈ ఘటన గురించి స్పందించాల్సి ఉంది. జర్నలిస్టులపై దాడి గురించి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10కు చేరింది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎం జగన్ ప్రజలనుద్దేశించి ప్రశంసించనున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు గురించి... రేషన్, నగదు పంపిణీ గురించి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏపీ ప్రజల గురించి జగన్ ప్రసంగించనున్నారని తెలుస్తోంది.     
 

మరింత సమాచారం తెలుసుకోండి: