తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 44కి చేరింది. వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు డాక్టర్లు ఉన్నారని సమాచారం. ఇప్పటివరకు రాష్ట్రంలో ఏడు కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. 
 
నిన్న మూడేళ్ల బాబుకు కరోనా సోకినట్లు ప్రకటన వచ్చింది. ఈరోజు నమోదైన కేసుల్లో హైదరాబాద్ నగరంలో దోమలగూడలో ఉంటున్న భార్యాభర్తలైన ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. డాక్టర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇద్దరు డాక్టర్లకు పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఢిల్లీ నుంచి కుత్బుల్లాపూర్ కు వచ్చాడని తెలుస్తోంది. 
 
అతనిలో కరోనా లక్షణాలు కనిపించడంతో అతనిని అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. తాజాగా అతనికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. డాక్టర్లు హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారని తెలుస్తోంది. అధికారులు ఇద్దరు డాక్టర్లను కలిసిన పేషెంట్ల గురించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. 
 
ప్రభుత్వం ఎన్నో ముందుజాగ్రత్తచర్యలు చేపడుతోంది. కానీ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం ప్రభుత్వాన్ని, ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఏపీలో ఇప్పటివరకూ 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణతో పోలిస్తే ఏపీలో కరోనా ప్రభావం తక్కువగానే ఉందని చెప్పవచ్చు.                  

మరింత సమాచారం తెలుసుకోండి: