దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కరోనా బాధితుల సంఖ్య 657కు చేరింది. తెలంగాణలో ఈరోజు మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 44కు చేరింది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరింత కఠినంగా రాబోయే 20 రోజులు గడపాల్సి ఉందని చెప్పారు. 
 
ఈరోజు కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో లాక్ డౌన్ గురించి, రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. అధికార యంత్రాంగం మరింత కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాపించకుండా ఉండేందుకు సామాజిక దూరం పాటించాలని సూచించారు. కరోనా నిరోధం, రాత్రిపూట కర్ఫ్యూ, లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. 
 
సీఎం కలెక్టర్లు, ఎస్పీలతో ఫోన్ లో మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సీఎం అధికారులకు విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో, సన్నిహితుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. క్వారంటైన్ లో ఉన్నవారి విషయంలో, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. రాష్ట్రంలో లాక్ డౌన్, కర్ఫ్యూ సక్సెస్ కావడం పట్ల అధికారులను, పోలీసులను సీఎం అభినందించారు. 
 
రాష్ట్ర ప్రజలు కరోనా కట్టడి కోసం ఇదే విధంగా కృషి చేయాలని చెప్పారు. ప్రజల నుండి ప్రభుత్వానికి సహకారం అందితే ప్రమాదకరమైన వ్యాధి నుంచి రాష్ట్రాన్ని బయటపడేయవచ్చని చెప్పారు. రేయింబవళ్లు రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న వైద్యులను, పోలీసులను, శానిటరీ ఉద్యోగులను సీఎం అభినందించారు. సీఎం ఆదేశాలతో రాబోయే రోజుల్లో లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు కానుంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: