ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చినవారిని క్వారంటైన్ కు తరలిస్తున్నామని అన్నారు. ఒక వ్యక్తికి వైరస్ వస్తే ఎక్కడినుంచి వస్తుందో తెలీదని... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని కోరుతున్నానని చెప్పారు. ఏప్రిల్ 14 వరకు ఎవరూ ప్రయాణాలు చేయవద్దని సూచించారు. 
 
మనవాళ్లను మనం ఆపే పరిస్థితి ఇబ్బందికరమే అని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 10 పాజిటివ్ కేసులు తేలాయని... ఈ 10 కేసులు పెరగకుండా ఉండాలంటే అందరి సమిష్టి కృషి అవసరమని అన్నారు. రాష్ట్రానికి 27,819 మంది విదేశాల నుంచి వచ్చారని... వీరందరిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 
 
కరోనా కట్టడి కోసం గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎం లను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. సామాజిక దూరం పాటించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని... కరోనాను ఎదుర్కోవడానికి నాలుగు చోట్ల క్రిటికల్ కేర్ ఆస్పత్రులను ఏర్పాటు చేశామని అన్నారు. క్రమశిక్షణతోనే కరోనా వంటి వ్యాధులను గెలవగలమని... ఇంట్లో పెద్దవాళ్ల విషయంలో బాధ్యత వహించాలని చెప్పారు. 
 
సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 బెడ్లను క్వారంటైన్ కోసం ఏర్పాటు చేశామని తెలిపారు. 21 రోజులు ప్రజలు సహకరించకపోతే ప్రభుత్వం ఎంత కృషి చేసినా ప్రయోజనం ఉండదని అన్నారు. దయచేసి ఎవ్వరూ కూడా ఎక్కడివాళ్లు అక్కడే ఉండిపోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. 1902 అనే నంబర్ కు ఫోన్ చేసి ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకోవాలని జగన్ సూచించారు.                   

మరింత సమాచారం తెలుసుకోండి: