ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు అమలు చేయాల్సి ఉంటుందని... సరైన నిర్ణయాలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. నిన్న రాత్రి తెలంగాణ సరిహద్దు నుంచి మనవాళ్లు ఏపీలోకి రావడానికి ప్రయత్నించారని... ఇలాంటి పరిస్థితులు చూస్తే మనవాళ్లను మనం చిరునవ్వుతో రాష్ట్రంలోకి ఆహ్వానించే పరిస్థితి లేదా...? అని అనిపించిందన్నారు. 
 
వైరస్ వ్యాప్తిని ఎక్కడివాళ్లు అక్కడ ఉంటే మాత్రమే నివారించగలమని తెలిపారు. తెలంగాణలో ఉన్న ఏపీ వాళ్ల గురించి సీఎం కేసీఆర్ తో మాట్లాడానని.... కేసీఆర్ సానుకూలంగా స్పందించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని చెప్పారు. తెలంగాణలో ఏపీ వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కాల్ సెంటర్ కు కాల్ చేస్తే సహాయసహకారాలు అందిస్తామని ...  తానే స్వయంగా చూసుకుంటానని  కేసీఆర్ గారు చెప్పారని అన్నారు. 
 
గుంటూర్ బోర్డర్ లో 44 మందికి, ప్రకాశం బోర్డర్ లో 152 రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చామని... వీరు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు. ఇప్పటివరకూ ఏపీలో 10 పాజిటివ్ కేసులు తేలాయని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చిన వారిని ఇళ్లకు పంపించలేమని ప్రతి ఒక్కరూ గమనించాలని పేర్కొన్నారు. వారంతా నేరుగా ఇంటికి వెళ్తే వారి కుటుంబానికి కూడా అపాయం కలిగే అవకాశం ఉందన్నారు. 
 
రాష్ట్ర ప్రజలు ఏప్రిల్ 14 వరకు ఇంటికే పరిమితమైతే వైరస్ వ్యాప్తిని నివారించగలమని అన్నారు. ఆశా వర్కర్లు, గ్రామ సచివాలయంలోని హెల్త్ అసిస్టెంట్లు, వాలంటీర్లు చేస్తున్న సేవలు గొప్పవని ప్రశంసించారు. వాలంటీర్ల వ్యవస్థ బాగుంది కాబట్టే కరోనాను ఎదుర్కోగలుగుతున్నామని... సామాజిక దూరంతోనే కరోనా మహమ్మారి నుంచి బయటపడగలమని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం తెలిపారు.       

మరింత సమాచారం తెలుసుకోండి: