ప్రపంచాన్ని వణికిస్తున్న కొరోనా వైరస్ అమెరికాలో పెరిగిపోవటానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణమా ? అవుననే అంటున్నారు అమెరికాలో జనాలు. అంటె ఒక విధంగా అమెరికాలోని జనాలు కూడా కారణమనే చెప్పాలి. ఎలాగంటే వైరస్ విషయంలో ప్రభుత్వంతో పాటు జనాలు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. యావత్ దేశాలన్నీ ఒకవైపు కొరోనా దెబ్బకు వణికిపోతుంటే అమెరికా మాత్రం చాలా నిర్లక్ష్యంగా కనిపించింది. దాని ఫలితమే ఇపుడు అనుభవిస్తోంది.

 

అమెరికాలో కొరోనా వైరస్ బాధితుల సంఖ్య సుమారుగా 70 వేలకు చేరుకుంది. దాదాపు 1200 మంది చనిపోయారు. అగ్రరాజ్యమైన అమెరికాలో అన్ని వేల కేసులు నమోదు కావటం ఏమిటి ? వెయ్యిమందికి పైగా చనిపోవటమేంటి ? అనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరే మొదట్లో ఏదో నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టే కేసులు పెరిగిపోయాయని అనుకున్నా ఇపుడు కూడా అదే పద్దతిలో పోతున్నారంటే అర్ధం ఏమిటి ? ప్రపంచంలో దాదాపు 70 దేశాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది. కానీ అమెరికాలో మాత్రం ఇంకా ఆ విషయమై జాతీయ స్ధాయిలో నిర్ణయం తీసుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

 

ఇక్కడే అమెరికాలోని జనాలు ట్రంప్ ను తీవ్రంగా తప్పుపడుతున్నారు. అమెరికాలో 50 రాష్ట్రాలున్నాయి. ఇప్పటి వరకూ 21 రాష్ట్రాలు మాత్రమే లాక్ డౌన్ పాటిస్తున్నాయి. అంటే ఇవి కూడా తమ పరిధిలో వాటంతట అవే నిర్ణయం తీసుకున్నాయి కానీ దేశం మొత్తం మీద ఓ పాలసి అంటు తీసుకోలేదని మరచిపోకూడదు. పైగా లాక్ డౌన్ పాటిస్తే దేశం చాలా ఇబ్బదుల్లో పడిపోతుందని ట్రంప్ వాదిస్తుండటమే విచిత్రంగా ఉంది. అమెరికాను షట్ డౌన్ చేస్తే సమస్యకన్నా పరిష్కారం మరింత ప్రమాదకరంగా ఉంటుందని ట్రంప్ అభిప్రాయపడుతున్నాడు.

 

అందరూ డిమాండ్ చేస్తున్నట్లు దేశాన్ని లాక్ డౌన్ చేస్తే సమస్యలు మరింత పెరిగిపోతాయట. దేశం తీవ్ర ఆర్ధిక మాంద్యంలోకి కూరుకుపోతే వేలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటారంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికాలోని పారిశ్రామికవేత్తలే తప్పు పడుతున్నారు. షట్ డౌన్ చేయకపోతే దేశం మొత్తం నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ట్రంప్ దెబ్బకు అమెరికా వైభవం కోల్పోవటం ఖాయమని అందరూ అనుకుంటున్నారు. మరి ఈ సమస్య నుండి ట్రంప్ ఎలా బయటపడతాడో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: