తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోంది. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. పోలీసులు రోడ్లపైకి వచ్చే వారి నుండి పూర్తి వివరాలు తెలుసుకొని మాత్రమే అనుమతిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుందని సమాచారం. 
 
రోడ్లపైకి ఎక్కువగా వాహనాలు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం, పోలీసులు నూతన నిబంధనలను అమలులోకి తెచ్చారు. రోడ్డుపైకి వచ్చిన వాహనం మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ప్రయాణిస్తే ఆ వాహనానికి ఫైన్ విధించనున్నారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ రాష్ట్ర ప్రజలకు మూడు కిలోమీటర్ల పరిధిలోపే నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయాలని గతంలోనే సూచించింది. కానీ కొందరు ఈ నిబంధనలను పాటించడం లేదు. 
 
అందువల్ల తెలంగాణ పోలీస్ శాఖ నూతన నిబంధనలను అమలులోకి తెచ్చింది. సీసీ కెమెరాల ద్వారా స్టార్టింగ్ పాయింట్ నుండి మూడు కిలోమీటర్లు దాటిన వాహనాలకు ఆటోమేటిక్ గా ఫైన్ పడే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. జరిమానా విధించినా వాహనదారులు పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్ చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించి మాత్రమే నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 
 
మొదటి రోజు లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడంతో సీఎం కేసీఆర్ అవసరమైతే ఆర్మీని రంగంలోకి దింపుతానని హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈరోజు రాష్ట్రంలో మరో మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 44కు చేరింది. రాష్ట్రంలో ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో పోలీస్ శాఖ రాష్ట్రంలో కఠిన నిబంధనలను అమలు చేస్తోంది.               

మరింత సమాచారం తెలుసుకోండి: