దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా బాధితుల సంఖ్య 657కు చేరింది. తెలంగాణాలో 44 కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో 10 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా పేరు చెబితే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలంలోని గుడివాకలంక గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
ప్రజలు, గ్రామ పెద్దలు కలిసి గుడివాకలంక గ్రామంలోకి ఇతర గ్రామాల ప్రజలు ఎవ్వరూ ప్రవేశించరాదని సూచించారు. గ్రామంలోకి తాపీ, పెయింటింగ్ , టైల్స్ పనివారికి ప్రవేశం లేదని, ఇతర పని వారు కూడా గ్రామంలోకి ప్రవేశించవద్దని ఫ్లెక్సీల ద్వారా కోరారు. గుడివాకలంక గ్రామనికి చెందిన వారై ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వస్తే టెస్టులు చేయించుకొని గ్రామంలోకి రావాలని సూచించారు. 
 
ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని... ఆశా వర్కర్స్ సహాయంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకుని కరోనా లేదని నిర్ధారణ అయితే మాత్రమే గ్రామంలోకి ప్రవేశించాలని సూచించారు. ఊరి బయట ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారి కోసం సూచనలతో పాటు ఆశా వర్కర్ల పేర్లు, ఫోన్ నంబర్లతో కూడిన ఫ్లెక్సీని పెట్టారు. 
 
సోషల్ మీడియాలో గ్రామస్థులు వేయించిన ఫ్లెక్సీ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇతర గ్రామాల, పట్టణాల ప్రజలు గుడివాకలంక గ్రామస్థుల్లా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కృషి చేయాలని పలు గ్రామాలలో గ్రామ పెద్దల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థులు తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రజలు స్వచ్చందంగా కరోనా నివారణ కోసం కృషి చేస్తే రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కావని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.          

మరింత సమాచారం తెలుసుకోండి: