లాక్ డౌన్ సందర్బంగా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు . తెలుగు రాష్ట్రాల్లోనే కాదు , దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది . కరోనా కట్టడి కి దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 వతేదీ వరకు   లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెల్సిందే . లాక్ డౌన్ ను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులకు అప్పగించాయి . ఈ  సందర్బంగా పోలీసులు  తమ ప్రతాపాన్ని సామాన్య  ప్రజలపై  చూపిస్తున్నారు .  కూతురి ఆకలి తీర్చేందుకు పాల పాకెట్ కోసం వెళ్లిన ఓ సామాన్యుడు పోలీసుల దెబ్బలకు తాళలేక మృత్యువాత పడిన ఘటన   పశ్చిమ బెంగాల్ లోని హౌరా నగరం లో జరిగింది .

 

స్థానికంగా నివసించే లాల్ స్వామి అనే వ్యక్తి చిన్నారి కూతురి కోసం పాల పాకెట్ కొనుగోలు కోసం  రోడ్డెక్కాడు . లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్డుపైకి వచ్చిన లాల్ స్వామి ని చూసిన పోలీసులు రెచ్చిపోయారు . అతన్ని ఇష్టారీతిలో చితకబాదారు . ఎలాగో పోలీసుల నుంచి తప్పించుకున్న లాల్ స్వామి ఇంటి వరకు చేరుకొని గుమ్మం లోనే కుప్పకూలిపోయాడు . దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనగా ఆసుపత్రికి తరలించగా , అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు . పోలీసుల వైఖరి ని నిరసిస్తూ స్థానికులు రోడ్డెక్కే ప్రయత్నం చేయగా , సాయుధ బలగాలతో వారిని అడ్డుకున్నారు .

 

అయితే లాల్ స్వామి మృతి ఘటనపై పోలీసులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది . పోలీసులు కొట్టిన దెబ్బల వల్ల లాల్ స్వామి చనిపోలేదని ,అతను గుండె నొప్పితో చనిపోయాడంటూ స్థానిక పోలీసులు చెప్పుకొచ్చారు . అయితే   కుటుంబ సభ్యులు మాత్రం లాల్ స్వామిని పోలీసులే కొట్టి చంపారని మండిపడ్డారు . ఈ సంఘటన తో  నైనా దేశ వ్యాప్తంగా పోలీసులు కనువిప్పు కలుగుతుందేమో చూడాలి. అదే సమయం లో లాక్ డౌన్ నిబంధనలను  ఉల్లంఘించి సామాన్యులు కూడా  ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వెళ్లడం కూడా మానుకుంటే మంచిది . 

మరింత సమాచారం తెలుసుకోండి: