కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యం లో హైదరాబాద్ లోని హాస్టళ్లలో ఉంటున్న ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లాలని భావించారు . ఈ మేరకు తెలంగాణ పోలీసుల నుంచి నిరభ్యంతర పత్రాలను తీసుకుని , ఆంధ్ర ప్రదేశ్ కు బయల్దేరారు . అయితే వారిని అంతరాష్ట్ర సరిహద్దు వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు నిలువరించి , వెనక్కి తిరిగిపోవాలని ఆదేశించారు . అయితే గత రెండు రోజులుగా వాడపల్లి చెక్ పోస్టు వద్ద పడిగాపులు పడుతున్న విద్యార్థులు , ఇతరులు తమను స్వస్థలాలకు అనుమతించాలని ఆంధ్ర ప్రదేశ్  పోలీసులతో వాగ్వాదానికి దిగారు .

 

అయినా పోలీసులు ససేమిరా అనడం తో ఆగ్రహించిన కొంతమంది  పోలీసులపైకి రాళ్లు రువ్వారు . ఈ ఘటన లో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి . దాంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీలకు పని చెప్పారు . దీనితో వాడపల్లి చెక్ పోస్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి .  సంఘటన స్థలానికి చేరుకొని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్  పరిస్థితిని సమీక్షించారు . ఈ విపత్కర పరిస్థితుల్లో పెద్ద సంఖ్యలో జనసమూహం ఒకే చోట ఉండడం సరికాదని , ఎక్కడి నుంచి వచ్చిన వారు అక్కడికి తిరిగి వెళ్లాలని సూచించారు . ఒకవేళ ఎవరికైన వాహనాలు లేకపోతే బస్సులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు . పోలీసులపై  రాళ్లు రువ్వడం కరెక్టు కాదన్న ఆయన , ఈ తరహా ఘటనల వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు .

 

 హైదరాబాద్ కు తిరిగి  వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా,  సాఫీగా వారు గమ్యం  చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని రంగనాథ్ చెప్పుకొచ్చారు . ఇక ఇప్పటికే కరోనా వ్యాధి విస్తృతిని అడ్డుకునేందుకు ఎక్కడి వారు అక్కడే ఉండేందుకు వీలుగా హాస్టళ్లను యధావిధిగా కొనసాగించేలా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: