కరోనా ఓవైపు విజృంభిస్తున్న నేపథ్యంలో రేపు ఏపీ మంత్రివర్గం భేటీ కానుంది. రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. వెలగపూడిలోని సచివాలయంలోని మొదటి బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఈ కేబినెట్‌ సమావేశం జరుగుతుంది. అయితే.. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా సీఎం జగన్‌ తో పాటు మంత్రులు సామాజిక దూరం పాటించాలని నిర్ణయించారు. అందుకే సమావేశం వేదిక మారింది.

 

 

అయితే ఈ కేబినెట్ సమావేశంలో కరోనా అంశం కంటే ఎక్కువ ప్రయారిటీ ఓ ఆర్డినెన్స్‌ కు దక్కనుంది. వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్‌ ను ఏప్రిల్ ఒకటి లోగా ఆమోదించుకోవాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తి ప్రభావం నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే విషయం పెండింగ్‌లో పడింది. కానీ ఆరు నూరైనా బడ్జెట్ ఏప్రిల్ ఒకటి నాటికి ఆమోదం పొందాల్సిందే. లేకపోతే రాష్ట్రంలో ఆర్థిక పాలన స్తంభించిపోతుంది.

 

 

అందుకే మధ్యే మార్గంగా మూడు నెలల బడ్జెట్‌కు సంబంధించి జూన్‌ 30 వరకు అవసరమైన నిధుల కోసం ఆర్డినెన్స్‌ తీసుకురావాలని జగన్ సర్కారు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేబినెట్‌ సమావేశంలో ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో కరోనా పరిస్థితిని కట్టడి యత్నాలుపై చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్ ఆర్డినెన్సును మంత్రివర్గం ఆమోదం తర్వాత గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు పంపుతారు.

 

 

కరోనా ప్రభావం ఉన్నా.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి తాత్కాలిక బడ్జెట్‌కు ఆమోదం పొందాలని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతుండటం జన జీవనం స్తంభించిపోవడం కారణంగా అసెంబ్లీ నిర్వహణ భావ్యం కాదనే అభిప్రాయంలో మంత్రి వర్గం ఉంది. అందుకే ఆర్డినెన్స్‌ తీసుకురావాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: