ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ బారిన ప‌డి మృతి చెందుతున్న వారి సంఖ్య అమాంతంగా పెరిగిపోతోంది. శుక్ర‌వారం ఉద‌యం నాటికి ఈ సంఖ్య ఏకంగా 24,070కి చేరుకుంది. ఇక దాని బారిన ప‌డిన వారి సంఖ్య 531800కు చేరుకుంది. ఇది మ‌రింతగా పెరిగే ప్ర‌మాద‌ముందని అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఒక్క‌చైనాలో త‌ప్ప మిగ‌తా దేశాల్లో ఎక్క‌డ కూడా క‌రోనాను క‌ట్ట‌డి చేసిన‌ట్లు మాత్రం క‌నిపించ‌డం లేదు. ఇక ఇటలీ, స్పెయిన్, ఇరాన్‌లో అయితే క‌రోనాతో క‌ల‌క‌లం రేగుతోంది. మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్ప‌టివ‌ర‌కు చైనాలో 3,292 మంది, ఇట‌లీలో 8,215మంది, స్పెయిన్‌లో 4,365మంది క‌రోనాతో మృతి చెందారు. అమెరికాలో 85,300మంది దీని బారిన ప‌డ్డారు. సుమారు వెయ్యిమందికిపైగా మృత్యువాత ప‌డ్డారు. అక్క‌డి ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు.

 

భార‌త్‌లో కూడా క‌రోనా బాధితుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 700మంది దీని బారిన ప‌డ‌గా 16మంది మృతి చెందిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌రింత అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. అయితే.. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది.ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఇదిలా ఉండ‌గా, కరోనాను అరికట్టడంలో తమ దేశానికి భారత్‌ అందించిన సాయానికి డ్రాగ‌న్ కంట్రీ ధన్యవాదాలు తెలిపింది. ఇప్పడు చైనా కోలుకోవడంతో భారత్‌కు సాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత్‌లో చైనా రాయబార కార్యాలయం ఒక ప్రకటన జారీ చేసింది. కాగా, వైర‌స్ పుట్టిన చైనాలోని వుహాన్‌న‌గ‌రం ప్ర‌స్తుతం సాధార‌ణ స్థితికి చేరుకుంటున్న విష‌యం తెలిసిందే. 

 

ఇక ఇట‌లీ త‌ర్వాత స్పెయిన్‌లోనే మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉంటోంది. కరోనా వైరస్‌తో స్పెయిన్‌లో ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే ఏకంగా 655 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య అమాతంగా పెరిగిపోతోంది. ఇక కేసుల సంఖ్య జెట్‌స్పీడ్‌తో వెళ్లిపోతోంది. ఆరోగ్య కేంద్రాలు సరిపడినన్ని లేకపోవడంతో ప్రభుత్వం హోటళ్లన్నింటినీ తాత్కాలికంగా ద‌వాఖాన‌లుగా మార్చి రోగులకు సేవలు అందిస్తోందంటే ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా మారుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇరాన్‌లో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి ఊరికి, ఊరికి మధ్య సరిహద్దుల్ని కూడా మూసేసి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈదేశంలో గురువారం ఒక్క రోజే 157మంది మృతి చెందారు. ఇక్క‌డ మొత్తం మృతుల సంఖ్య 2,234కి చేరుకుంది. ఇక కేసుల సంఖ్య 30 వేలకి చేరుకోవడంతో ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణాలపై ప్రభుత్వం నిషేధం విధించింది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: