దేశంలో కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ఏపీలో 11 కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. లాక్ డౌన్ కారణంగా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం పీఎం కిసాన్ తొలి విడత నిధులను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేయాలని నిర్ణయించింది. 
 
రైతుల ఖాతాలలో నిధులు విడుదలైన రెండు రోజుల్లో నగదు జమవుతుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 8.69కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. నిన్న ఆర్థిక ప్యాకేజీ ప్రకటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం కిసాన్ మొదటి విడత నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ప్రతి సంవత్సరం పీఎం కిసాన్ పథకం అమలులో భాగంగా కేంద్రం 6,000 రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేస్తుంది. 
 
2,000 రూపాయల చొప్పున మూడు విడతల్లో రైతుల ఖాతాలలో నగదు జమవుతుంది. ఇందులో భాగంగా తొలి విడత నగదు ఏప్రిల్ మొదటివారంలో జమ కానుంది. రాష్ట్రంలో కరోనా ప్రభావం పరోక్షంగా రైతులపై పడింది. కొన్ని ప్రాంతాలలో ప్రజలు నిర్ణీత సమయాల్లోనే కూరగాయలు కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించటంతో వ్యాపారులు కూరగాయలను తక్కువ మొత్తంలో, తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. 
 
దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో పురుగు మందులు, ఎరువులు కొనుగోలు చేయడంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయసహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: