దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా దేశంలోని అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రధాని మోదీ కొన్ని రోజుల క్రితం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని లాక్ డౌన్ ప్రకటన చేసిన తరువాత దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులకు, కూరగాయలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరగడంతో మార్కెట్ లో కూరగాయల రేట్లు కూడా పెరుగుతున్నాయి. 
 
2019 సంవత్సరం చివరలో ఉల్లిపాయల రేట్లు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గత నెల రోజుల నుండి ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రధాని లాక్ డౌన్ ప్రకటన చేయక ముందు కిలో ఉల్లి 20 రూపాయలు పలకగా హైదరాబాద్ లో కిలో ఉల్లి 40 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ప్రభావంతో ఉల్లి ధర మరలా పెరిగింది. ఉల్లి ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 
 
నిన్న మలక్ పేట వ్యవసాయ మార్కెట్ లో జరిగిన వేలంలో నాణ్యమైన మొదటి రకం ఉల్లి కిలో 33 రూపాయలు పలికింది. గత నాలుగు రోజుల నుండి మార్కెట్ మూతపడి తెరచుకున్న తరువాత రికార్డు స్థాయిలో ఉల్లి రేటు పెరిగింది. లాక్ డౌన్ ప్రభావంతో డిమాండ్ కు తగిన విధంగా ఉల్లి మార్కెట్ కు రావడం లేదు. అందువల్ల ఉల్లి ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
మరోవైపు ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ ప్రకటించిన మరుసటి రోజే తెలంగాణలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో మరుసటిరోజు నుంచి కూరగాయల ధరలు అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వాలు నిత్యావసర వస్తువులు, కూరగాయల విషయంలో రేట్లు పెరగకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: