కొరోనా వైరస్ నియంత్రణ విషయం అధికారపార్టీ ఎంఎల్ఏలే పట్టించుకోవటం లేదా ? స్వయంగా పంచాయితీరాజ్ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే ఈ విషయంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయటం గమనార్హం. తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సమయంలో పెద్దిరెడ్డి అనేక అంశాలపై మాట్లాడారు. ఇదే సందర్భంగా ఎంఎల్ఏల పనితీరు విషయంలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

తిరుపతి ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి, చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి లాంటి ఇద్దరు ముగ్గురు మాత్రమే సామాజిక బాధ్యతగా కొరోనా నియంత్రణపై జనాల్లో అవగాహన కల్పిస్తున్నారు. అలాగే సెల్ఫ్ క్వారంటైన్, ఐసొలేషన్ వార్డులు, సోషల్ డిస్టెన్సింగ్, లాక్ డౌన్ వల్ల ఉపయోగాలు, శానిటైజర్ల వాడకంపై భూమన, చెవిరెడ్డి మాత్రం ప్రతిరోజు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వీళ్ళద్దరు ప్రతిరోజు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ లాక్ డౌన్ పాటించాల్సిన అవసరంపై గట్టిగా చెబుతున్నారు.

 

లాక్ డౌన్ ను కచ్చితంగా పాటిస్తే కొరోనా వైరస్ పై దాదాపు విజయం సాధించినట్లే అని జనాలకు  వివరిస్తున్నారు. భూమన ప్రతిరోజు  తిరుపతిలోని ఏదో ఓ సెంటర్లో నిలబడి మైకుల ద్వారా జనాలను ఎడ్యుకేట్ చేస్తున్నారు. జిల్లాలోనే ఉన్న మిగిలిన ఎంఎల్ఏల మాటేమిటి అంటే సమాధానం ఉండటం లేదు. సరే చంద్రబాబునాయుడు ఏకంగా ఏపిని వదిలేసి వెళ్ళి హైదరాబాద్ లోని తన రాజమందిరంలోనే క్యాంపు వేసేశాడు. కాబట్టి ఏపి విషయంలో చంద్రబాబుకేమీ పట్టింపు లేదు.

 

అలాగే తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలు కూడా పెద్దగా జనాలకు అవగాహన కల్గించటం లేదు. పాలకొల్లు ఎంఎల్ఏ నిమ్మల రామానాయడు కూడా పట్టణంలో తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. మురికివాడల్లోను, రోడ్లపక్కన రామానాయుడు బ్లీచింగ్ లాంటివి చల్లుతూ జనాల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద 175 మంది ఎంఎల్ఏలు, 25 మంది ఎంపిలున్న రాష్ట్రంలో ఓ నలుగురైదుగురు మాత్రమే జనాల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారంటే మిగిలిన వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారో అర్ధమైపోతోంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: