దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం కఠిన చర్యలు చేపడుతోంది. తెలంగాణలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోం శాఖ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బలగాలను పంపించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం సహాయసహకారాలు కోరింది. కేంద్రం వెంటనే స్పందించి బలగాలను పంపగా కొద్దిసేపటి క్రితమే బలగాలు హైదరాబాద్ కు చేరుకున్నాయి. 
 
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈరోజు మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో 47 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం ఎన్ని చర్యలు చేపడుతున్నా ప్రతిరోజు కొత్త కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కొన్ని ప్రాంతాలలో ప్రజలు గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో కేంద్ర బలగాల రాకతో కరోనా కట్టడి అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం ముందుజాగ్రత్తచర్యలు చేపడుతోంది. అవసరమైతే కరోనా కోసం ప్రైవేట్ వైద్యుల సహాయసహకారాలు తీసుకోనుంది. రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా బాధితుల కోసం 10,000 పడకలు సిద్ధం చేస్తోంది. 190 వెంటిలేటర్లను, 700 ఐసీయూలను అందుబాటులో ఉంచింది. 
 
రాష్ట్రంలో భారీ సంఖ్యలో కేసులు నమోదైనప్పటికీ ఏ ఒక్కరి పరిస్థితి విషమంగా లేదని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో కొంతమంది డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో రెండో దశలో ప్రైవేట్ వైద్యశాలలను కూడా వాడుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. కేంద్ర బలగాల రాకతో రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోకి వస్తుందేమో చూడాల్సి ఉంది.                       
 

మరింత సమాచారం తెలుసుకోండి: