తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రోజురోజుకు కేసులు పెరుగుతూ ఉండటంతో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో ఇప్పటివరకూ 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. కరోనాతో అమెరికా లాంటి దేశమే ఆగమైందని అన్నారు. రాష్ట్రంలో ఈరోజే పది కొత్త కేసులు నమోదయ్యాయని ప్రకటన చేశారు. రాష్ట్రంలో 20,000 మంది క్వారంటైన్ లో ఉన్నారని చెప్పారు. 
 
మనం కఠిన చర్యలు తీసుకోకపోతే విస్ఫోటనంలా ఉండేదని చెప్పారు. ఈరోజు ఉదయం ప్రధాని మోదీతో రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల గురించి మాట్లాడానని అన్నారు. రాష్ట్రంలో ఒకరు మాత్రం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని... 58 మందికి చికిత్స జరుగుతోందని చెప్పారు. క్వారంటైన్ లో ఉన్నవారి విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటన చేశారు. ప్రజలు సహకారం అందిస్తున్నారని మరింత సహకారం అవసరమని అన్నారు. 
 
మనం ఎన్నో కఠిన చర్యలు చేపట్టినా కొత్త కేసులు నమోదవుతున్నాయని... కఠిన చర్యలు చేపట్టకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ చేసి, కర్ఫ్యూ పెట్టినా పది కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజలు కరోనా ఎంత భయంకరమైన వ్యాధో ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్పారు. 
 
ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను సులభంగా నివారించవచ్చని అన్నారు. గాంధీ, కింగ్ కోటి ఆస్పత్రులలో వైద్య సేవలను సిద్ధం చేస్తున్నామని... గచ్చిబౌలి స్టేడియంలో 1400 ఐసీయూ బెడ్స్ సిద్ధమవుతున్నాయని తెలిపారు. రిటైర్డ్ అయిన 11,000 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నారని ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలు అనవసరంగా భయాందోళనకు గురి కావద్దని సీఎం సూచించారు.                          
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: