క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. దీంతో ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. అత్య‌వ‌స‌ర‌, నిత్యావ‌స‌రాల కోసం ఇంటికొక్క‌రు చొప్పున బ‌య‌ట‌కు వెళ్తున్నారు. రోజూ పనికి వెళ్తేనే పూట‌గ‌డిచే నిరు పేద‌లు త‌మ అవ‌స‌రాలు తీర‌క తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇందులో ప్ర‌ధానంగా దివ్యాంగులు, వితంతువులు, సీనియ‌ర్ సిటిజ‌న్ల ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారుతోంది. సాధార‌ణ ప‌రిస్థితుల్లోనే ప్ర‌భుత్వం అందించే పింఛ‌న్‌పై ఆధార‌ప‌డే వీరు.. లాక్‌డౌన్ నేప‌థ్యంలో మ‌రింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో పేద‌ల‌ను ఆదుకునేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే చ‌ర్య‌లు చేప‌ట్టాయి. రేష‌న్ బియ్యం పంపిణీ, కొంత ఆర్థిక సాయం అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. తాజాగా.. కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 

 

దివ్యాంగులు, సీనియ‌ర్ సిటిజ‌న్లు, వితంతువుల‌కు మూడు నెల‌ల పింఛ‌న్‌ను అడ్వాన్స్‌గా అందిస్తామ‌ని శుక్ర‌వారం కేంద్ర అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో వారికి కొంత ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. మూడు నెల‌ల పింఛ‌న్ ముంద‌స్తుగానే అంద‌నుండ‌డంతో ఎంతో భ‌రోసాగా ఉంటుంది. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేప‌థ్యంలో వారికి అవ‌స‌ర‌మైన అత్య‌వ‌స‌ర‌, నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను ముంద‌స్తుగానే తెచ్చిపెట్టుకునే అవ‌కాశం క‌లుగుతుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా ఎంత‌మంది దివ్యాంగులు, సీనియ‌ర్ సిటిజ‌న్లు, వితంతువులు ఉన్నార‌న్న విష‌యాన్ని మాత్రం అధికార వ‌ర్గాలు ఇంకా వెల్ల‌డించలేదు.

 

దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల్లోనే ల‌బ్ధిదారులు ఉండే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏప్రిల్ 14వ తేదీవ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని, అవ‌స‌ర‌మైతే పెంచే అవ‌కాశం కూడా ఉన్న నేప‌థ్యంలో కేంద్రం ముంద‌స్తుగా మూడు నెల‌ల పింఛ‌న్ డ‌బ్బుల‌ను అందించేందుకు నిర్ణ‌యం తీసుకుని ఉంటుంద‌ని అంటున్నారు. కాగా, లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం 1.7ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ను క‌రోనా ప్యాకేజీగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రోజువారీ కూలీలు, చిరు ఉద్యోగులు, వ్యాపారులు.. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌లు ఎలాంటి ఇబ్బందుల‌కు గురికాకుండా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ.. దిశానిర్దేశం చేస్తోంది. ఇక ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే న‌గ‌రాల్లో చిక్కుకుపోయిన వారికి ఉచితంగా భోజ‌నం అందిస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: