దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కు చేరింది. కేసుల సంఖ్య పెరగడంతో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేసీఆర్ మాట్లాడుతూ కరోనాకు ప్రపంచంలో మందులు లేకపోవడమే అతిపెద్ద బలహీనత అని అన్నారు. భయంకరమైన రాక్షసితో మనం యుద్ధం చేస్తున్నామని... కరోనా వ్యాప్తిని నిరోధించడమే పెద్ద మందు అని చెప్పారు. 
 
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించడమే పెద్ద మందు అని అన్నారు. చైనా, అమెరికా, స్పెయిన్ స్థాయిలో భారత్ లో కరోనా ప్రభావం చూపితే 20 కోట్ల మంది ఈ వ్యాధి భారీన పడే అవకాశం ఉందని... ఇలాంటి పరిస్థితుల్లో స్వీయ నియంత్రణే మనకు శ్రీరామరక్ష అని అన్నారు. ప్రజలకు ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం పనికి రాదని... ప్రభుత్వం పూర్తి స్థాయి సన్నద్ధతతో సిద్ధంగా ఉందని తెలిపారు. 
 
గాంధీ, కింగ్ కోటి ఆస్పత్రుల్లో కరోనా బాధితులకు పూర్తి స్థాయిలో 
వైద్య సేవలు అందించటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో 1400 ఐసీయూ బెడ్స్ సిద్ధమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 11 వేల వార్డులను సిద్ధం చేశామని ప్రకటన చేశారు. 11,000 మంది రిటైర్డ్ అయిన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని అవసరం అయితే వీరి వైద్య సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు. 
 
రాష్ట్రంలో మరో 500 వెంటిలేటర్ల కోసం ఆర్డర్ చేశామని... తెలంగాణలో ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ కొనసాగనుందని చెప్పారు. ప్రధాని మోదీతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించినట్లు తెలిపారు. కేంద్రం రాష్ట్రానికి అన్నిరకాలుగా సాయం చేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ప్రభుత్వం కరోనా కట్టడికి చేస్తున్న కృషిని ప్రధాని మోదీ ప్రశంసించారని... తమకు ఇంకా బాగా పని చేయాలని సూచించిన మోదీకి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: