కరోనా వైరస్. దీనికి మందు లేదు కాబట్టి సైన్స్ ఏమీ చేయలేదు. ఇక దేవుడే దిక్కు అనుకుని మొక్కినా ఆయన సైతం తలుపులేసుకున్నాడు కాబట్టి భక్తి కూడా సరిపోవడంలేదు. కరోనాకు దేవుడికి తేడా లేదు. ఎందుకంటే ఇద్దరూ అందరినీ సమానంగా చూస్తున్నామని అంటున్నా పగబట్టి పనిపట్టేది మాత్రం ఎక్కువగా  ఆ ఒక్క  వర్గాన్నే.

 

అదే పేద వర్గం. ఏ ముప్పు వచ్చినా ముందు దొరికిపోయేది పేదవారే. ఇంట్లో ఉంటే ఆకలికి, బయటకు వస్తే కరోనా కాటుకు బలి అయ్యేది పేదవాడే. ఇక  పేదవాడితో పాటు పేద రాష్ట్రాలు కూడా ముందు వరసలోనే కరోనా వేటుకు తలవంచేలా ఉన్నాయి. అక్షర క్రమంలోనే అనే కాదు, ఆర్ధిక దిగజారుడులో కూడా ఆంధ్ర ప్రదేశ్ ఇపుడు మొదటి ప్లేస్ లోనే ఉంది.

 

ఏపీలో ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. గత ఆరేళ్ళుగా అప్పులకుప్పలా ఏపీ ఉంది. దాదాపు మూడు లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు వెళ్ళిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. జగన్ పాలనలో ఆదాయం ఏమీ పెరగలేదు, పైగా కొన్ని శాఖలలో తగ్గింది. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ ఆదాయం దారుణంగా పడిపోయింది.

 

అదే విధంగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇలా చాలా శాఖల నుంచి ఆదాయం బాగా తగ్గింది. ఇక వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం తగ్గింది. సరే ఇన్ని తగ్గినా కూడా కేంద్రం జీఎస్టీలో వాటా ఇస్తుంది. ఇపుడు లాక్ డౌన్ నేపధ్యంలో మొత్తం దేశమే మూతపడింది. దాంతో ఏపీనుంచి వచ్చే ఆదాయం కూడా ఏమీ ఉండదు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ఖజనా పూర్తిగా ఖాళీగా మారిపోతోంది.

 

లాక్ డౌన్  కనుక మరో మూడు నెలల పాటు సాగితే ఏపీ పూర్తిగా ఆర్ధికంగా ఇబ్బందుల్లో పడడం ఖాయమని అంటున్నారు. చెప్పాలంటే ఉద్యోగుల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అంటే కరోనా వైరస్ ని తట్టుకుని బయటపడినా కూడా అప్పటికి ఏపీ ఆర్ధికంగా పూర్తిగా చితికిపోయి ఉంటుంది. 

 

ఈ పరిస్థితిపై ఇపుడు ముఖ్యమంత్రితో పాటు, మంత్రులు సైతం మధనపడుతున్నట్లుగా సమాచారం. ఏపీ ఆర్ధిక స్థితి ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం  విపక్ష నేత హోదాలో బయట  నుంచి వింత డిమాండ్లు చేస్తున్నారు. ఒక్కొ పేద కుటుంబానికి  అయిదు వేల రూపాయలు నెలకు ఇవ్వాలని, వారికి పూర్తిగా రేషన్ సరకులు ఇవ్వాలని బాబు అంటున్నారు.

 

ఏపీ గురించి, ఆర్ధిక స్థితి గురించి పూర్తి అవగాహన ఉన్న బాబు ఇలా డిమాండ్ చేయడం ఫక్త్  రాజకీయమేనని అంటున్నారు. ఈ సంగతి పక్కన పెడితే ఇపుడు చంద్రబాబు కరోనా వైరస్ నేపధ్యంలో సీఎం కుర్చీలో ఉండకపోవదం ఓ విధంగా పెద్ద రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారుట.

 

 

ఎందుకంటే బాబు అయినా అక్కడ చేసేదేమీలేదు. లాక్ డౌన్లు కంటిన్యూ అయి రాష్ట్రానికి ఒక్క పైసా ఆదాయం లేక కేంద్రం కూడా అలాగే ఉంటే బాబు మాత్రం ఏం చేయగలరు. అందుకే ఆయన ఓ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతూంటే జగన్ మాత్రం పెద్ద చిక్కుల్లో పడిపోయారని అంటున్నారు.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: