కేంద్రం దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలోకి విదేశాల నుంచి వచ్చినవారిని ముందుజాగ్రత్తచర్యల్లో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్వారంటైన్ లో ఉంచుతున్నాయి. కానీ కొందరు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. క్వారంటైన్ కేంద్రాల నుంచి తప్పించుకుంటూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. 
 
తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఒక వ్యక్తి క్వారంటైన్ నుంచి తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి ప్రియురాలిని చూడటానికి క్వారంటైన్ నుంచి తప్పించుకున్నాడని తెలిసి షాక్ అవ్వడం పోలీసుల వంతయింది. కొన్ని రోజుల క్రితం 24 ఏళ్లు యువకుడు దుబాయ్ నుండి ఇండియాకు వచ్చాడు. ఇతని స్వస్థలం తమిళనాడులోని మధురై. కేంద్రం కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చినవారిని క్వారంటైన్ కు తరలించాలని ఆదేశించింది. 
 
ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు యువకుడిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. అయితే ప్రియురాలిని చూడటానికి ఇండియాకు వచ్చిన యువకుడు ఆమెను ఎలాగైనా చూడాలని క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకున్నాడు. క్వారంటైన్ కేంద్రం నుంచి యువకుడు తప్పించుకోవడం స్థానికంగా కలకలం రేపింది. 
 
అయితే ఎట్టకేలకు పోలీసులు యువకుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు. యువకుడితో పాటు అతని అతడు ప్రేమించిన యువతిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా ఎంతో గాఢంగా తాము కొన్ని సంవత్సరాల నుండి ప్రేమించుకున్నామని యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో క్వారంటైన్ నుంచి పారిపొయానని చెప్పాడు. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేంద్రం ఆదేశాలతో రాష్ట్రంలో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. క్వారంటైన్ నుంచి కొందరు పారిపోతున్నట్లు ఫిర్యాదులు వస్తూ ఉండటంతో ప్రభుత్వం క్వారంటైన్ నుంచి ఎవరూ పారిపోకుండా చర్యలు చేపట్టింది.                      


మరింత సమాచారం తెలుసుకోండి: