క‌రోనా వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని రంగాల‌కు, దేశాల‌ను, ప్ర‌జ‌ల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తోంది. ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. వ‌ర్క్ ఫ్రం అనే విధానం అందుబాటులో ఉన్న‌ప్ప‌టికీ...ఇది అంద‌రికీ అందుబాటులో లేక‌పోవ‌డం పెద్ద‌ స‌మ‌స్య‌. అయితే, ఈ వెసులుబాటు క‌లిసివ‌చ్చేది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌కే. ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ కాగ్నిజెంట్ త‌న ఉద్యోగుల‌కు సంతోషాన్ని క‌లిగించే వార్త‌ను ప్ర‌క‌టించింది. కాగ్నిజెంట్‌లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు 25 శాతం అద‌న‌పు జీతం చెల్లించ‌నుంది. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది.

 


కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు రాసిన లేఖలో అసోసియేట్ స్థాయి వరకు ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు మూలవేతనంలో 25 శాతం అదనంగా చెల్లించనున్న‌ట్లు ఉద్యోగుల‌కు తీపిక‌బురు తెలిపారు. భార‌త్‌, ఫిలిపీన్స్ దేశాల‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కు ఈ స‌హాయం వ‌ర్తిస్తుంద‌ని వివ‌రించారు. ఈ విధానాన్ని నెలవారీగా సమీక్షిస్తామని కంపెనీ సీఈఓ వెల్ల‌డించారు. ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతను ర‌క్షించే క్ర‌మంతోపాటు ఖాతాదారులకు సురక్షతమైన సేవలను కొనసాగించేందుకు  ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది. 

 


`క‌ష్ట‌మైన సమయంలో మనమందరం ప్రతిరోజూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాం..అయినా ఒకరికొకరం సాయం చేసుకుంటూ కలిసికట్టుగా, ధైర్యంతో పనిచేస్తూ సవాళ్లను అధిగమిద్దాం`` అని సీఈఓ ప్ర‌క‌టించారు.  తాజా నిర్ణయం భారత్‌లో ఉన్న మూడింట రెండు వంతుల కాగ్నిజెంట్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. కరోనా సంక్షోభ సమయంలో ఇంటినుంచే పనిచేసేందుకు ఎక్కువ మందికి అవకాశం  కల్పించింది. ప‌లువురు ఉద్యోగులకు కొత్త ల్యాప్‌టాప్‌లను అందించడం, డెస్క్‌టాప్‌ ఎన్ క్రిప్టింగ్, అదనపు బ్యాండ్‌విడ్త్ కనెక్టివిటీ, ఎయిర్ కార్డులను అందించడం లాంటి కీలక చర్యల్నికూడా తీసుకుంది. అన్ని గ్లోబల్ కంపెనీల మాదిరిగానే, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రభావానికి తాము  కూడా గురవుతున్నామని కంపెనీ తెలిపింది. వీరోచితంగా పనిచేస్తున్న ఉద్యోగ బృందాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్లిష్ట స‌మ‌యంలో సేవ‌లు అందిస్తున్న త‌మ ఉద్యోగుల‌కు భ‌విష్య‌త్‌లో మ‌రింత చేయూత‌నిచ్చేలా కార్య‌చ‌ర‌ణ‌ను త‌ర్వాత ప్ర‌క‌టిస్తామ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: