లాక్‌డౌన్‌...క‌రోనా వ్యాధి స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిన ప్ర‌భుత్వ ఆదేశం. కరోనా నియంత్రణ కోసం తీసుకున్న లాక్‌డౌన్ నేపథ్యంలో ప్ర‌జ‌లు త‌మ‌కు కావాల్సిన వ‌స్తువులు, సేవ‌ల విష‌యంలో ఒకింత ఆందోళ‌న‌లో ఉన్నార‌నేది నిజం. ఎమర్జెన్సీ సర్వీసుల కింద వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ వంటి నిత్యావసరాలు అందుతాయని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ..ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌ల‌గ‌డం లేదు. లాక్‌డౌన్‌ ఇంకా కొనసాగితే.. కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో అవసరం లేకున్నా ముందస్తుగానే బుక్‌ చేసుకుంటున్నారు.. ఆ తర్వాత ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముందస్తుగా ఒక సిలిండర్‌ను అందుబాటులో ఉంచుకుంటున్నారు. అయితే, ఇలాంటి బుకింగ్స్ వ‌ల్ల ఏం జ‌ర‌గ‌నుంది, ప్ర‌స్తుత ప‌రిస్థితులు ఏంట‌నేది ఆయా వ‌ర్గాలు వివ‌రిస్తున్నాయి.

 

తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి 7 లక్షల 65 వేల కుటుంబాలకు 712 గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్‌ సరఫరా చేస్తున్నారని అన్నారు. దీనికోసం సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల మంది సిబ్బంది సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ నేప‌థ్యంలో ప్రజలు వంట గ్యాస్‌ కొరత వస్తుందని భయబ్రాంతులకు గురికావద్దని కోరారు. కరోనా భయంతో డెలివరీ బాయ్స్‌ను ఇండ్లలోకి రావద్దని చెబుతున్నారని, అవసరమైతే మేయిన్‌గేట్‌ వద్ద డెలివరీ ఇస్తామన్నారు. వంటగ్యాస్‌ అయిపోతుందనంగా.. రెండు రోజుల ముందు బుక్‌చేసుకుంటే సరిపోతుందన్నారు. డిస్ట్రిబ్యూటర్‌ దగ్గరికి వెళ్లినా అప్పటికప్పుడు డెలివరీ ఇస్తారన్నారు. గ్యాస్‌ బుకింగ్‌ సమయాన్ని 21 రోజుల వ్యవధితో అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

 

మ‌రోవైపు అధికారులు స్పందిస్తూ, అవసరం ఉంటేనే సిలిండర్లు బుక్‌ చేసుకోవాలని  కోరారు. వంటగ్యాస్‌ సరఫరాకు ఢోకా ఏర్పడదని తెలిపారు.  సోషల్‌ డిస్టెన్స్‌లో భాగంగా కాలనీలు, అపార్ట్‌మెంట్‌ వాసులు, గేటెడ్‌ కమ్యూనిటీ వర్గాలు డెలివరీ బాయ్స్‌కు సహకరించాలని చెబుతున్నారు. మెయిన్‌గేట్‌ వద్ద సిలిండర్‌ ఇస్తే ఎవరికీ వారు తీసుకువెళ్లాలని, సీనియర్‌ సిటిజన్లకు సంబంధిత నివాసితులే అందజేయాలని ప్రతిపాదనలు చేశారు. సిలిండర్‌ బుకింగ్‌కు నిర్ణీత సమయాన్ని ఖరారు చేయబోతున్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: