కరోనా కట్టడి కోసం ప్ర‌భుత్వం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా లాక్‌డౌన్‌, ప‌రిమితంగా ఆయా వ‌ర్గాలు బ‌య‌ట సంచ‌రించే వీలు క‌ల్పించాయి. అయితే, కొంద‌రు ఈ ష‌ర‌తుల వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్న ప‌రిస్థితి ఉంది. అలాంటి వారికోసం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. లాక్‌డౌన్‌ సందర్భంగా అతిముఖ్యమైన సేవలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల స్టాఫ్‌, డయాగ్నస్టిక్‌ కేంద్రాల సిబ్బందికి ఐడీ కార్డులు చూపిస్తే పాసులిస్తారు. వంట గ్యాస్‌, మినరల్‌ వాటర్‌ సరఫరా చేసే వారిని నేరుగా అనుమతిస్తారు.

 

హైద‌రాబాద్‌కు చెందిన పాల ఉత్పత్తులు, కూరగాయలు, ఎల్పీజీ గ్యాస్‌, మాంసం ఉత్పత్తులు, ఫార్మసూటికల్స్‌, వైద్యం, కేబుల్‌ తదితర అసోసియేషన్‌ ప్రతినిధులతో తెలంగాణ‌ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య‌ కార్యదర్శి జయేశ్‌రంజన్‌, న‌గర సీపీ అంజనీకుమార్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 

 

 

హైద‌రాబాద్‌ ప్రజలకు నిత్యావసర వస్తువులను సరఫరా చేయడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసే పరిస్థితిని కల్పిస్తామని.. అందుకోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని జ‌యేశ్ రంజ‌న్ అన్నారు. ఆహార ఉత్పత్తులు తరలించేవారు ఏ రూట్లలో అనుమతి కావాలో దరఖాస్తు చేస్తే పాస్‌లు ఇస్తామన్నారు. వస్తువుల సరఫరా, తయారీ విషయంలో తప్పని సరిగా తక్కువ మంది ఉండాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. ‘కొందరు పాసులు తీసుకొని  దుర్వినియోగం చేస్తున్నారని ఇటీవల సైబరాబాద్‌లో ఇలానే దుర్వినియోగం చేశారన్నారు. నిత్యావసరాలకు ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. పాలు, కూరగాయలు తదితర విషయాల్లో ప్రజలు మంత్రి కేటీఆర్‌, తదితరులకు మెసేజ్‌లు పెడుతున్నారన్నారు.

 


హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ,  వ్యాపారుల ఇబ్బందులు కూడా తెలుసుకొని, ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు వారి అభిప్రాయాలను తీసుకొని ఆ మేరకు చర్యలు తీసుకుంటారని అన్నారు. కరోనా కట్టడి కోసం అన్ని ప్రభుత్వ విభాగాలు పనిచేస్తున్నాయని, హైదరాబాద్‌లో 10 వేల మంది పోలీసులు పనిచేస్తున్నారని  నగర సీపీ అంజనీకుమార్‌ అన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాలో ఇబ్బందులు రాకుండా వ్యాపారులు, ఏజెన్సీలతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం అందరికీ పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: